వాగును ఆగం.. ఆగం చేస్తుండ్రు..!


 కల్వకుర్తి : ఇందిరమ్మ ఇళ్లు, భవన నిర్మాణాలు జోరుగా ఊపందుకుంటున్నాయి. ఈ తరుణంలో ఇసుక‌ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. దీనినే అవకాశంగా మలుచుకున్న కొందరు అక్రమార్కులు వాగులను కొల్లగొడుతూ..ఇదే ఆదాయ వనరుగా మార్చుకున్నారు. నేడు ఈ ఇసుక దందా మూడు టిప్పర్లు ఆరు లారీలుగా సాగిపోతుంది. సంబంధిత శాఖలకు చెందిన కొందరు అధికారులు, కాంట్రాక్టర్ల మిలాఖత్ తో ఇసుక దందా కొత్త పుంతలు తొక్కుతుంది. నియంత్రించాల్సిన అధికారులు మాముళ్ళ మత్తులో కొనసాగడం వల్లే ఈ దందా గుట్టు చ‌ప్పుడు లేకుండా జరుగుతుందనే ఫిర్యాదులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ తతంగం నాగర్ కర్నూల్ జిల్లాలోనీ ఉప్పునుంతల మండలం దాసర్ల పల్లి వాగులో జరుగుతుంది. టిప్పర్ల మోతతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జిల్లాలోని వంగూర్, ఉప్పునుంతల మండలాలు ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి. ఈ మండలాల గ్రామశివారులలో ఎక్కడ చూసిన ఇసుక డంపులు దర్శనమిస్తాయి. విచ్చలవిడిగా ఇసుక దందాను నిర్వహిస్తూ టిప్పర్ ఇసుకను రూ. 35 నుంచి 42 వేల అమ్ముతున్నారు. అక్రమార్కుల తీరు - వాల్టా చట్టానికి తూట్లుపొడుస్తున్నట్టుగా ఉందని ఆయా గ్రామాల గ్రామస్తుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఇసుక క్వారీ, వాహన అనుమతులు ఎక్కడ ....ఎలా ...?

జిల్లాలోని ఉప్పునుంతల మండలం దాసర్ల పల్లి గ్రామశివారులోని 183, 217 గల సర్వే నంబర్లలో 1 ఎకరా 10 గుంటలకు 16.683 మెట్రిక్ టన్నుల ఇసుక ను టిజిఎండిసి (తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ ) ద్వార ఇసుక అనుమతులిచ్చారు. ఈ క్వారీలో ఇసుక తరలించడానికి పది టైర్లకు సంభందించిన 25 టిప్పర్లు అనుమతులు పొందాయని సమాచారం. డిడి కట్టిన ఈ టిప్పర్లలో ఒక్కో టిప్పర్ కి 19.5 టన్నుల ఇసుకను మాత్రమే నింపాలని సంభందిత శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహనం రిజిస్టేషన్ అయ్యి పూర్తి కండిషన్ లో ఉండాలని, వాహన ఇన్సూరెన్స్, పర్మిట్, ఫిట్నేస్, డ్రైవర్ కు లైట్ మోటార్ వెహికల్ లైసెన్సు కలిగి ఉండాలి.

అక్రమ ఇసుక టిప్పర్ల ప్రయాణం ఎలా..?

ఉప్పునుంతల మండల దాసర్ల పల్లి దుంధుబి వాగులో అక్రమంగా ఇసుకను నింపుకున్న టిప్పర్లు రఘుపతిపేట మీదుగా లింగసానిపల్లి, గుండూర్, పంజుగుల, కల్వకుర్తి పట్టణంలోకి గచ్చుబావి రోడ్డు మీదుగా కుర్మిద్ద చౌరస్తా నాగర్ కర్నూల్ చౌరస్తా వైపు కొన్ని, సోమశిల హై వే నుంచి కొట్ర గేటు వైపు, జడ్చర్ల వైపు మరికొన్ని వెళ్తున్నాయి.

అనుమతులకు పాతర.. ఇసుకకు జాతర

ఇదే అదనుగా చూసుకున్న తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ( టిఎస్ఎండిసి) కి ముసుగు వేసి వేల టన్నుల కొద్ది ఇసుకను అక్రమ మార్గం పట్టిస్తూ రోజుకు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఏట ఇసుక ద్వార వందల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతున్నా.. అంతకు నాలుగింతలు ఇసుక మాఫియా జేబుల్లోకి వెళుతుంది. 183 , 217 గల ఓ వ్యవసాయ సర్వే నంబర్లలో ఎకరా పది గుంటలకు 16.683 మెట్రిక్ టన్నుల ఇసుక క్వారీ కోసమై టిఎస్ఎండిసి అనుమతులు ఇస్తే... కాంట్రాక్టర్ ఐనా ఆ భూ యజమానీ ఏకంగా మూడు ఎకరాల విస్తీర్ణంలో నట్ట నడి వాగు వరకు కబ్జా చేసి అండతో కలిసి పరిమితికి మించి ఇసుకను తోడేసి అమ్మేస్తున్నారు. 3 మీటర్ల మేర లోతులో ఇసుక తవ్వకాలను చేపట్టాలనీ సర్కారు మైనింగ్ శాఖ ఆదేశాలు ఉంటె... వీరు మాత్రం 6 మీటర్ల మేర అడ్డగోలుగా దోచుకున్నోడికే.. దోచుకున్నంతా అన్నా చందంగా తవ్వేసి దోచేస్తున్నారు. క్వారీ మొదలైనప్పటి నుండి ఆయా శాఖల అధికారులు వచ్చి చూస్తున్నారే తప్పా... ఇదేంటనీ ప్రశ్నించే వారే కరువయ్యారు. ముడుపులు ముడుతున్నాయా...లేక ప్రజా ప్రతినిధుల వత్తిడా...వాళ్ళకు కూడ మ్యా.. మ్యా లు ఉన్నాయనే కోణంలో రాష్ట్ర అధికారులు విచారణ చేపట్టాలి. దాసర్ల పల్లి ఇసుక క్వారీ వద్ద ఉన్న మైనింగ్ శాఖ విభాగానికి సంబంధించిన ఎస్ఆర్వో, ఎస్ఆర్ఏ చెప్పిన సమాచారం మేరకు ఇరువై ఐదు టిప్పర్ల ఇసుక అనుమతుల కోసమై ఉన్నాయన్నారు. కానీ అధికారుల చెప్పినవే కాకుండా 75 టిప్పర్ల వరకు అదనంగా చేరి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఇందులో కొన్ని వాహనాలకు నెంబర్ ప్లేట్లు సరిగ్గా కనిపించవు... ఇంకొన్ని నెంబర్ ప్లేట్ ఉండదు. అదేంటని విలేకరులు ఎస్ఆర్వో నీ ప్రశ్నిస్తే చాసెస్ నెంబర్ బట్టి ఇవ్వొచ్చు అని సమాధానం చెప్పాడు. పది టైర్ల టిప్పర్లలో 19.5 టన్నుల ఇసుకను నింపి పంపేది పోయి 30 టన్నులకు పైగా నిండ నింపి పంపిస్తున్నారు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటె టిప్పర్ టాప్ పై స్థలం ఉన్నా పంపే దుస్థితి నెలకొంది. పరిమితికి మించి ఇసుక నిండిన టిప్పర్ల తో అధిక వేగంతో రోడ్లపై వెళ్తుంటే రఘుపతిపేట, లింగసాని పల్లి, గుండూర్, పంజుగుల గ్రామ ప్రజలు భయందోలనలకు గురవుతున్నారు.

వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు

రాత్రింబవంళ్లు వాగుల్లో భారీ ఎత్తైన 5 యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. తవ్విన ఇసుకను టిప్పర్ల సాయంతో అనధికారికంగా పక్కన మండలాలకు, జిల్లాలకు చేరవేసి అక్రమంగా అడ్డగోలుగా సంపాదిస్తూ... సర్కారు ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. కట్టేది గోరంతా... కొట్టేసేది కొండంతన్నట్టుగా ఉంది ఇసుకాసురుల వ్యవహారం. దీని ఫలితంగా పరీవాహకాల్లో భూగర్భజలాలు వేగంగా కిందకి పడిపోతున్నాయి. పంటచేలకు నీరందించే బోర్లపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. రాత్రింబవళ్ళు చేపట్టే అక్రమ ఇసుక తవ్వకాలపై మైనింగ్‌, పోలీస్, రెవెన్యూ అధికారులు ప్రణాళిక ప్రకారం దాడులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

తూతూ మంత్రంగా తనిఖీలు

ఉప్పునుంతల మండలం దాసర్ల పల్లి వాగు నుంచి పగలు - రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. శుక్రవారం ఓ టిప్పర్ ఓవర్ లోడ్ ఇసుకతో లింగసానిపల్లి గ్రామం వద్ద బోల్తా పడింది. ఎదురుగా ఏ వాహనం లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఇంతా జరుగుతున్నా మైనింగ్, రెవిన్యూ, పోలీసు అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ..నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నా పోలీసులు కనీసం వే బిల్లులు లేని టిప్పర్లను ఆపిన దాఖలాలు లేవు. ఇరు శాఖ అధికారుల అండదండలతోనే ఇసుకాసురులు రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చర్యలు శూన్యం

నిబంధనలకు పాతర వేస్తె జరిగే నష్టాలు అధికారులు తెలియవా... జరగబోయే, జరుగుతున్న దుర్ఘటనలకు పూర్తి బాధ్యత ఆయా శాఖల అధికారుల నిర్లక్షమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కల్వకుర్తి నుంచి రఘుపతిపేట కు గత 4 యేండ్ల క్రిందట వేసిన డబుల్ రోడ్డు నేడు ఈ టిప్పర్ల ఓవర్ లోడ్ ల కారణంగా రోడ్డు దిబ్బతిని భారీ గుంతలు ఏర్పడుతున్నా అధికారులు నిమ్మకు నిరేత్తనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర స్థాయి మైనింగ్ శాఖ, ఎంఫోర్సుమేంట్ & విజిలెన్సు అధికారులు తప్పుదోవలో నడుస్తున్నా ఈ దాసర్ల పల్లి క్వారీ పై పూర్తి ద్రుష్టి సారించాలని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా వారిపై వాల్ట చట్టం కింద కేసులు నమోదు చేయాలని పట్టణ, గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow