Russian Oil: ట్రంప్‌ ఎఫెక్ట్‌.. రష్యా చమురుకు భారత్‌, చైనా దూరం: అమెరికా


 ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించే అంశంలో భాగంగా రష్యాపై ఆర్థికఒత్తిడి పెంచేందుకు ఆ దేశంలోని చమురు (Russian Oil) సంస్థలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ చర్యలు.. మాస్కో (Russia) చమురు సంస్థలపై తీవ్ర ప్రభావం చూపించాయని తాజాగా అమెరికా ట్రెజరీ శాఖ పేర్కొంది. 

రష్యాలో అతిపెద్ద చమురు కంపెనీలైన రోస్‌నెఫ్ట్‌ (Rosneft), లుక్‌ఆయిల్‌ (Lukoil)పై ట్రంప్‌ ఆంక్షలు విధించారు. దీని నేపథ్యంలో భారత్‌, చైనా కొనుగోలుదారులు దూరం కావడంతో ఆ దేశ చమురు ధరలు పతనమైనట్లు ట్రెజరీ శాఖ సీనియర్‌ అధికారి విలేకరులతో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు లభిస్తున్న నిధులపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఆ దేశ చమురుకు సంబంధించిన ముందస్తు కొనుగోళ్లను రద్దు లేదా పాజ్‌ చేసి ఎలా అయినా బయటపడేందుకు కొనుగోలుదారులు మార్గాలు వెతుకుతున్నట్లు తెలిపారు. రోస్‌నెఫ్ట్‌, లుక్‌ఆయిల్‌ కంపెనీలతో తమ సంబంధాలను ఎలా తగ్గించుకోవాలనే దానిపై సలహాల కోసం తమను ఆశ్రయించినట్లు అధికారి తెలిపారు.

రష్యా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం చమురు, గ్యాస్‌ ఎగుమతుల నుంచే వస్తుంది. రోస్‌నెఫ్ట్‌, లుక్‌ఆయిల్‌ దేశంలో అతిపెద్ద చమురు కంపెనీలుగా ఉన్నాయి. దేశ చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ రెండు కంపెనీలదే. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అక్టోబర్‌ 22న ఆంక్షలు (US Sanctions On Russia) విధించారు. అంతేకాదు వాటి అనుబంధ సంస్థలతోనూ లావాదేవీలు సాగించే సంస్థలకూ ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. ఉక్రెయిన్‌- రష్యా యుద్ధం ముగించేందుకు 28 సూత్రాలతో అమెరికా శాంతి ప్రణాళికలు రూపొందించినట్లు వార్తలు  వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా ఉక్రెయిన్‌ కొంత భూభాగాన్ని వదులుకోవడంతో పాటు సైన్యాన్ని కూడా తగ్గించుకోవాలి. ఈ ప్రణాళికలోని అంశాలు రష్యాకే అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇప్పటికే ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కూడా అందినట్లు సమాచారం. ఈ ప్రణాళికపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow