Private Travels: పండగ వేళ దండుకుందాం!


 హైదరాబాద్‌: సంక్రాంతి పండగ రద్దీని ప్రైవేటు బస్సు ఆపరేటర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి నగరాలకు వెళ్లే రైళ్లలో, ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లను, ప్రత్యేక బస్సులను ప్రకటించడంలో రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు జాప్యం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్ని ప్రైవేటు ఆపరేటర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. 

9, 10న భారీ డిమాండ్‌

సంక్రాంతి పండక్కి ముందు వస్తున్న వారాంతం కావడంతో జనవరి 9, 10 తేదీల్లో భారీ డిమాండ్‌ ఉంది. ఆ తర్వాత రోజుల్లోనూ రద్దీ ఉన్నా ఈ రెండు రోజుల్లో ఎక్కువ మంది ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. దీంతో ప్రైవేటు బస్సుల ఆపరేటర్లు అమాంతం ఛార్జీలను పెంచేస్తున్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా.. గరిష్ఠంగా 50 శాతానికి మించడం లేదు. ప్రైవేటు బస్సుల యజమానులు మాత్రం రెండు, మూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు.

పట్టించుకోని రవాణాశాఖ

ప్రైవేటు బస్సుల్లో ఛార్జీల్ని ఇష్టారాజ్యంగా పెంచుతున్నా రవాణాశాఖ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌-బెంగళూరు బస్సు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైన తర్వాత బస్సుల ఫిట్‌నెస్, ఇతర భద్రతా పరమైన అంశాలను కొద్ది రోజులు తనిఖీలు చేసి అధికారులు కేసులు పెట్టారు. ఏటా పండగ సమయంలో భారీగా ఛార్జీలు పెంచుతున్నా కేవలం హెచ్చరికలకు పరిమితం అవుతున్నారు.

హైదరాబాద్‌-విశాఖపట్నం: ఆర్టీసీలో టికెట్‌ ధర రూ.1,889. ప్రైవేటులో రూ.5 వేల నుంచి రూ.5,999. అదే ప్రైవేటు స్లీపర్‌ బస్సుల్లో టికెట్‌ ధర రూ.6,999. జనవరి 9న హైదరాబాద్‌-విశాఖపట్నం విమాన టికెట్‌ ధర రూ.6,157.  

హైదరాబాద్‌-రాజమహేంద్రవరం: ఆర్టీసీ సూపర్‌ లగ్జరీలో రూ.1,032. స్లీపర్‌లో రూ.2,338 ఛార్జీ ఉంటే.. ప్రైవేటు సీటర్‌లో రూ.2,599-రూ.4,999 వసూలు చేస్తున్నారు. స్లీపర్‌లో ధర రూ.5,999.

హైదరాబాద్‌-విజయవాడ: ఆర్టీసీలో సీటర్‌ టికెట్‌ రూ.440 ఉంటే..ప్రైవేటులో రూ.1,750-రూ.1,799. అదే స్లీపర్‌లో బెర్తు కావాలంటే.. సౌకర్యాన్ని బట్టి రూ.3,500-5,999గా నిర్ణయించారు.

హైదరాబాద్‌-బెంగళూరు: ఆర్టీసీ స్లీపర్‌ బస్సు టికెట్‌ రూ.1,203. అదే ప్రైవేటు బస్సుల్లో ఒక్కో బెర్తుకు ఆపరేటర్‌ను బట్టి రూ.2,799-6,899 వరకు వసూలు చేస్తున్నారు. జనవరి 9న విమాన టికెట్‌ ధర రూ.3,956గా ఉంది.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow