నవాబుపేట : కూతురు ఇతర కులం యువకుడిని ప్రేమించి అతడి వెంట వెళ్లడాన్ని జీర్ణించుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండల పరిధిలోని హన్మసానిపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కౌల్లఎల్లయ్య (40) గురువారం తన వ్యవసాయ పొలం వద్ద చింతచెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఊరిలోకి వెళ్లి వస్తానని భార్య అరుణకు చెప్పి వెళ్లిన ఎల్లయ్య తెల్లవారే సరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. మృతుడి భార్య అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం మృతుడు ఎల్లయ్య, అరుణలకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు గౌతమి.
గౌతమి ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంటి వద్దనే ఉండేది. బుధవారం ఇంటి వద్ద ఆమె కనిపించకపోవడంతో ఆమె కోసం వెతుకుతుండగా నవాబుపేట మండల కేంద్రంలో కొండాపూర్ గ్రామానికి చెందిన వడ్డే చందు అనే యువకుడితో కలిసి కనిపించింది. అందుకు తల్లిదండ్రులు గౌతమిని కారణం అడగగా చందును తాను ప్రేమిస్తున్నానని అతడినే పెళ్లి చేసుకుంటానని వారితో చెప్పింది. ఆమెకు నచ్చజెప్పి తమవెంట గౌతమిని ఇంటికి తీసుకువచ్చారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు.
Tags
mahabubnagar