Reservations in Panchayat Election Telangana : రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లన్నీ ఈసారి మారతాయని తెలిపింది. మొదటగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయాలని నిర్దేశించింది. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం అనుమతించగా ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది.
రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 545 గ్రామీణ మండలాల్లోని 12,760 గ్రామాలు, వాటిల్లో 1,13,534 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎన్నికల్లో 50 శాతం మేరకు రిజర్వేషన్లు, మిగిలిన 50 శాతం జనరల్ కేటగిరీ స్థానాలుంటాయి. 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వే (ఎస్ఈఈఈపీసీ) 2024 ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి.
ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను కేటాయించాలి. బీసీ రిజర్వేషన్లు ఎస్ఈఈఈపీసీ-2024 సర్వే ప్రాతిపదికన ఉంటాయి.
సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయాలి.
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి. ఏప్రాంతంలోనైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ విధానంలో ఆ స్థానానిక రిజర్వేషన్ ఖరారు చేయాలి.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంటాయి.
సరి సంఖ్యలో సీట్లకు సమస్య లేదు. బేసి సంఖ్యలో సీట్లు ఉంటే 0.5 శాతాన్ని పరిగణలోనికి తీసుకోవద్దు. సున్నాను పరిగణించి నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు ఏదేని మండలంలో 11 సీట్లు ఉంటే 5.5 రిజర్వేషన్ రావాలి. 0.5ను పరిగణనలోకి తీసుకోకుండా 5 సీట్లనే కేటాయించాలి.
పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు, జనరల్ కేటగిరీలో సీటు కేటాయిస్తే దానిని మార్చే అవకాశం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని అన్నీ సరిచూసుకునే ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కోంది.
మూడు విడతల్లో ఎన్నికలు : రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేస్తే ఈ నెల 24న హైకోర్టులో విచారణ పూర్తికాగానే అదేరోజు లేదా మరుసటిరోజు షెడ్యూల్ ప్రకటించాలని ఎస్ఈసీ భావిస్తోంది. 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. డిసెంబరు 17 వరకు వార్డు సభ్యులు, సర్పంచ్ల ఎన్నికలు పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 12,760 పంచాయతీలు, 1,13,288 వార్డులు ఉన్నాయి. మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అదేరోజున ఫలితాలు ప్రకటించేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదినీ గురువారం ఉన్నతాధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఓటర్ జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ గురువారం ప్రారంభించారు. ఈనెల 23న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. బ్యాలెట్ బాక్సులు, ఇంకా తదితర ఎన్నికల సామగ్రిని ఇదివరకే ఎన్నికల సంఘం సేకరించింది. బీసీ రిజర్వేషన్లపై కోర్టులో వివాదం తేలిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలని మంత్రివర్గం నిర్ణయించింది.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు! - ఈనెల 25 లేదా 26న షెడ్యూలు
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - ఓటరు జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల
Tags
Telangana