ఎస్సై గల్లా పట్టి కొట్టిన కాంగ్రెస్ నేత.. ..పోలీసులకు రక్షణ లేకపోతే ప్రజలకు ఎలా..?


 జడ్చర్ల : జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతల దౌర్జన్యం కలకలం రేపింది. భూత్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఒక యాక్సిడెంట్ కేసులో రాజీ కుదరించేందుకు పోలీస్ స్టేషన్‌కి వచ్చి, కోరినట్టు రాజీ జరగకపోవడంతో ఆగ్రహంతో పోలీసులు మీదే దాడి యత్నానికి దిగారు. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఎస్సై గల్లా పట్టి కొట్టిన కాంగ్రెస్ నేత.

మంగళవారం, యాక్సిడెంట్ కేసు చర్చల మధ్య శ్రీనివాస్ రెడ్డి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భీమయ్యను గల్లా పట్టి కొట్టడంతో పాటు మరో కానిస్టేబుల్ లక్ష్మప్పను తోసేయడం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న ఎస్సై జయప్రసాద్ వారించడానికి ప్రయత్నించినప్పుడు, అతనిపైనా దౌర్జన్యంగా మాట్లాడి, బెదిరింపులకు పాల్పడ్డారు."నీ జాబ్ ఎంత..? నీవెంత..? నిన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తా… దమ్ముంటే బయటికి రా..!" అని ఎస్సైపై దాడి చేయడానికి 30 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై స్వయంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడిని లాకప్‌లో పెట్టారు.

ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పోలీస్ స్టేషన్‌కు చేరిక..

సమాచారం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి జడ్చర్ల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. జరిగిన సంఘటనలో ఎవరి తప్పు ఉన్నా విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. పోలీసులు ప్రజల కోసం ఉన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అన్నారు. మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ నెల 16న బురెడ్డిపల్లి వద్ద వాహన ప్రమాదం జరిగింద‌న్నారు. ఆ కేసులో రాజీ ప్రయత్నంలో మాటల తగవు గొడవకు దారితీసింద‌ని, పోలీసులపై దాడి యత్నం స్పష్టంగా కనిపిస్తున్నట్లు సీసీ ఫుటేజ్, సాక్షులు చెబుతున్నార‌ని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.



పోలీసులకు రక్షణ లేకపోతే ప్రజలకు ఎలా..?

ఘటన సమయంలో పోలీస్ స్టేషన్‌లో ఉన్న స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులకు రక్షణ లేకపోతే, సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి..? అని ప్రశ్నిస్తున్నారు. జడ్చర్లలో జరిగిన ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.



Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow