బీసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ
నవంబర్ 27 జడ్చర్ల ; కామారెడ్డి సభలో 42% రిజర్వేషన్ ఇస్తామన్న రేవంత్ రెడ్డి మాట తప్పారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మంత్రులను నిలదీయాలని మహబూబ్నగర్ జిల్లా బిజెపి పార్టీ అధికార ప్రతినిధి ఎట్లా బాలవర్ధన్ గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించిన ఆయనే ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామస్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నేరుగా ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి రాకముందు మాయ మాటలు చెప్పి అధికారం చేయెక్కించుకున్న తర్వాత బీసీలను ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు, బీసీల పక్షాన పోరాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు బడుగు బలహీన వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తన స్వగ్రామమైన గొల్లపల్లి పంచాయతీలో వార్డు సభ్యుల రిజర్వేషన్లలో బీసీలకు భారీ అన్యాయం జరిగిందని, తక్కువ జనాభా ఉన్న ఎస్సీ–ఎస్టీలకు వరుసగా రెండు సీట్లు కేటాయించగా, అధిక జనాభా ఉన్న బీసీలకు మాత్రం ఒక్కటే సీటు ఇవ్వడం ఏ న్యాయమని ప్రశ్నించారు. బీసీలపై దగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, బీసీల ఐక్యత శక్తి ఏంటో కాంగ్రెస్ నేతలకు తెలియజేయాల్సిన సమయం వచ్చిందని బాలవర్ధన్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని బీసీ నాయకులు ఐక్యంగా కదిలి, బీసీ పిల్లలకు రిజర్వేషన్లు పెరిగేలా కట్టుబడి పనిచేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఆయన స్పష్టంచేశారు.
