అలంపూర్ టౌన్:
అలంపూర్ మండలం క్యాతూర్ శివారులో ఒక వ్యక్తిని స్కార్పియో వాహనంతో ఢీ కొట్టి రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సంఘటన వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉండవెల్లి మండలం మారమునగాల గ్రామానికి చెందిన వెంకటేష్ క్యాతూర్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు పని ముగించుకుని గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనం పై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా క్యాతూర్ సమీపంలోని చెరువు కట్ట దగ్గరకు రాగానే స్కార్పియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేష్ బైక్‌ను ఢీ కొట్టి రాళ్లతో దాడి చేశారు. స్పృహ కోల్పోయిన వెంకటేష్ మృతి చెందాడని అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు.మధ్యాహ్నం జరిగిన సంఘటన రాత్రి పది గంటలకు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్‌ను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై పోలీసులను సంప్రదించగా దాడి జరిగిన సంఘటన నిజమేనని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటస్వామి తెలిపారు. గాయపడిన బాధితుడు ఒక గొడవ విషయంలో మధ్యవర్తిత్వం వహించాడు. దీని ఆధారంగానే దాడి జరిగినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Tags
mahabubnagar