ఇళ్లన్నీ భూమి లోపలే..!

 

ఏదైనా ఊరికి వెళితే ఎత్తయిన మేడలూ, మిద్దెలూ కనిపిస్తాయి. ఉత్తర చైనాలోని లియోస్‌ పీఠభూమి ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో అడుగుపెడితే మాత్రం ఎంత పెద్ద ఇల్లు అయినా సరే, దాన్ని పూర్తిగా చూడలేం. ఎందుకంటే అక్కడ ఇళ్లన్నీ భూమిలోపల మట్టి దిబ్బల్ని తొలిచి, ‘యౌడాంగ్‌’ పేరుతో కట్టుకున్నారు మరి. కొన్ని వేల సంవత్సరాల క్రితం వాతావరణ మార్పుల్ని తట్టుకునేలా సరికొత్త ఆలోచనతో నిర్మించుకున్న ఊరు ఇది. చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చల్లగా ఉండటమే ఈ ఇళ్ల ప్రత్యేకత. మట్టి, కలపను వాడుతూ కట్టుకున్న ఈ ఇళ్లు- చూడ్డానికి మండువా లోగిళ్లలా ఉంటాయి. అక్కడి నుంచి లోపలికి వెళితే మెట్లూ, వంటగది, డైనింగ్‌ రూమ్, ఇతర గదులన్నీ కనిపిస్తాయి. విద్యుత్తూ, నీళ్ల సరఫరా లాంటి సౌకర్యాలూ ఉంటాయట. పాత సంప్రదాయ పద్ధతిలోని ఈ వింత ఊరు ప్రస్తుతం ఓ చక్కటి సందర్శక ప్రాంతం. ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వచ్చి, నేలలోపల దాగున్న ఈ ఇళ్లన్నీ చూస్తూ, సరదాగా తిరిగేస్తుంటారు!  

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow