తెలంగాణలో 4 జాతీయ రహదారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ - రూ.10 వేల కోట్లతో నిర్మాణం
తెలంగాణలో నాలుగు జాతీయ రహదారుల నిర్మాణం - ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా - అటవీ, రైల్వే అనుమతులు పూర్తి
Central Govt gives Green Signal to Four National Highways : రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం ఎన్హెచ్ఏఐ చేపట్టదలచిన నాలుగు జాతీయ రహదారులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. జగిత్యాల-కరీంనగర్, ఆర్మూర్-జగిత్యాల, జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారులకు తాజాగా టెండర్లను ఆహ్వానించింది. నాలుగో జాతీయ రహదారైన మహబూబ్నగర్-గూడెబల్లూర్ హైవేకి సంబంధించిన టెండర్లను గత నెలలోనే పిలిచింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) 271 కి.మీ. మేర రూ.10,034 కోట్లతో ఈ నాలుగింటిని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.డిసెంబరులో టెండర్ల ప్రక్రియ ముగిసిన అనంతరమే జనవరి, ఫిబ్రవరి నెలలో ఈ పనులు ప్రారంభించేలా ఎన్హెచ్ఏఐ ఏర్పాట్లు చేయనుంది. జగిత్యాల-మంచిర్యాల హైవేని ఈపీసీ(ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో నిర్మించనున్నారు. మిగిలిన మూడింటిని హ్యామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్)లో ఏర్పాటు చేయనున్నారు. ఈ నాలుగింటికీ పర్యావరణ, అటవీ, రైల్వే అనుమతులు పూర్తి అయ్యాయి.
4 జాతీయ రహదారులకు అనుమతులు వచ్చేశాయి :
మహబూబ్నగర్-గూడెబల్లూర్ వరకు 80 కి.మీ. మేర రూ.2,662 కోట్లతో జాతీయ రహదారిని ఏర్పాటు చేస్తారు. దీని కోసం 465.7 హెక్టార్ల భూసేకరణ అవసరం కానుంది.జగిత్యాల-మంచిర్యాల హైవేని 68 కి.మీ. మేర రూ.2,550 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు 317 హెక్టార్ల భూసేకరణ జరగాల్సి ఉంది.ఆర్మూర్-జగిత్యాల జాతీయ రహదారిని 64 కి.మీ. మేర రూ.2,338 కోట్లతో నిర్మాణం చేయనున్నారు. మొత్తం 288.3 హెక్టార్ల భూసేకరణ చేయనున్నారు.జగిత్యాల-కరీంనగర్ హైవేని 59 కి.మీ. మేర రూ.2,484 కోట్లతో నిర్మాణం చేయనున్నారు. ఇందుకు మొత్తం 306.7 హెక్టార్ల భూసేకరణ అవసరం కానుంది.
ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం ఆరు వరుసలుగా :ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనుల సవరణ టెండర్లకు ఎన్హెచ్ఏఐ సిద్ధం అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆ పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. గతేడాది డిసెంబరులో సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి జిల్లాలోని తంగడ్పల్లి వరకు మొత్తం 161 కి.మీ. మేర నాలుగు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఇందుకు రూ.7,104 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇందుకు టెండర్లను పిలిచారు. అయితే ట్రాఫిక్ సర్వేకు అనుగుణంగా ఆరు వరుసలుగా అభివృద్ధి చేసిన తర్వాత మళ్లీ దీనిపై నిర్ణయం తీసుకున్నారు.
