నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా..* *కవిత సంచలన ప్రకటన*

 *


హైదరాబాద్, అక్టోబర్15: జాగృతి జనం బాట పేరుతో కల్వకుంట్ల కవిత తెలంగాణలోని జిల్లాల్లో యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా బుధవారం నాడు యాత్రపై మీడియాతో కవిత మీట్లాడుతూ.. నాలుగు నెలల పాటు యాత్ర ఉంటుందని.. ప్రతి జిల్లాల్లో రెండు రోజులు ఉంటామన్నారు. జిల్లాల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలతో కలిసి మాట్లాడతామని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం ఏం చేయాలనే విషయాలను ప్రజల నుండే తెలుసుకుంటామన్నారు. సామాజిక తెలంగాణ అంటే నినాదం కాదు విధానమని వివరించారు. తాము ఉన్నన్ని రోజులు సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే గురువులన్నారు. పెద్ద పెద్ద నాయకులను కూడా ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారని గుర్తుచేశారు. ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుంటామని కవిత అన్నారు.


*అది కరెక్ట్ కాదు...*

కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేస్తామన్నారు కవిత. కేసీఆర్ లేకుండా తెలంగాణ రాలేదని.. అయితే కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే నైతికంగా కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ‘నేను నా తొవ్వ వెతుక్కుంటున్నా’ అని అన్నారు కవిత. జాగృతి పెట్టినప్పుడు కూడా కేసీఆర్ ఫోటో పెట్టలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జాగృతి పెట్టినప్పుడు జయశంకర్ ఫోటో పెట్టామన్నారు. కేసీఆర్‌కు పుట్టడం తన అదృష్టమని.. ‘మా దారులు వేరే అయినప్పుడు నా లైన్ నేను తీసుకోవడం కరెక్ట్’ అని అన్నారు. కేసీఆర్ ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారని.. ఆ పార్టీ నుండి తనను సస్పెండ్ చేశారని తెలిపారు. నైతికంగా కరెక్ట్ కాదనే కేసీఆర్ ఫోటో తీసేస్తున్నట్లు వెల్లడించారు. దుర్మార్గుల నుంచి చెట్టును కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశానని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.


*కుట్రతో బయటకు పంపారు...*


జాగృతి మొదటి నుంచి స్వతంత్రంగా పని చేసిందని.. కేసీఆర్ నుంచి ఒక్క ఆలోచన తీసుకోలేదన్నారు. తాను బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత పార్టీతో జాగృతి అనుసంధానంగా పని చేసిందని వివరించారు. తన సస్పెన్షన్‌కు కారణాలను విశ్లేషించుకున్నానని తెలిపారు. పేగులు తెగేదాక తెలంగాణ కోసం కోట్లాడానని అన్నారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని.. సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడడం తప్పా అని ప్రశ్నించారు. ఏదో తప్పు మాట్లాడినట్టు చూపించి కుట్ర చేసి బయటకి పంపారని మండిపడ్డారు.


*ప్రభుత్వంపై విమర్శలు..*


ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్న రంగం లేదన్నారు. అనేక సమస్యలు తెలంగాణను పట్టి పీడిస్తున్నాయన్నారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్క రూపాయి కూడా తేలేకపోతున్నారని విమర్శించారు. పది సంవత్సరాల్లో తెచ్చిన ఫలితాలు ఇప్పుడు అందడం లేదని కవిత వ్యాఖ్యలు చేశారు.


*రాజీనామాపై...*


‘పార్టీ వద్దనుకున్నాక పదవి ఎందుకు. చాలా క్లారిటీతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. రాజీనామా చేసిన తర్వాత కూడా ఆమోదించడం లేదు. రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ రాజకీయం ఏంటో? పార్టీ పెట్టాలో లేదో ఇప్పటికీ క్లారిటీ లేదు. ప్రజలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. ప్రజలే గురువులు. కాబట్టి ఏం చేయాలో వారినే అడుగుతా. కేసీఆర్‌కు మచ్చ రాకుండా ఉండాలనే ప్రయత్నం చేశాను. కానీ నన్ను ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దారులు వేసినప్పుడు ధైర్యం ఉండాలి. బనకచర్ల, గోదావరి జలాలు లాంటి అన్ని అంశాలను మాట్లాడుతాం. యూరియా నుండి బస్సుల దాకా అన్ని రంగాల్లో సమస్యలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ చిన్న విషయం. ఉపఎన్నికతో జాగృతికి సంబంధం లేదు’ అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.


*యాత్ర పోస్టర్ విడుదల*


జాగృతి జనం బాట పోస్టర్‌ను కవిత విడుదల చేశారు. పోస్టర్‌పై తెలంగాణ తల్లి, జయశంకర్ ఫోటోలు ఉన్నాయి. కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాకుండా కేసీఆర్ ఫోటో తీసేయడానికి కారణాలు కూడా కవిత మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు..

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow