ఊర్కొండ : కెమికల్స్ ప్రయోగించడంతోనే చేపల మృతి చెందాయని, అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని తిమ్మన్నపల్లి ముదిరాజ్ సంఘం నాయకులు జగదీష్, రాజు, వెంకటయ్య, శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్వకుర్తి జడ్చర్ల రహదారి పక్కనే ఉన్న రేవల్లి శివారులోని చెరువులో కెమికల్స్ ఉపయోగించడంతోనే చేపలు మృతి చెందాయన్నారు. ప్రధానంగా కల్వకుర్తి- జడ్చర్ల రహదారి గుండా నెలలో ఒకటికి రెండుసార్లు వాహనాల్లో కెమికల్ తీసుకొచ్చి రోడ్డు పక్కన వేస్తుండడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. ప్రధానంగా ఈ రహదారి పక్కనే ఉన్న చెరువు సమీపంలో కెమికల్స్ వేయడం వల్ల నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి నీటి ప్రవాహంలో కలిసి చేపలు మృతి చెందాయని, కెమికల్స్ వేసిన చోట చెట్లు పొదలు కాలి బూడిద అయ్యాయని తెలిపారు. ఇటువంటి సంఘటనే గత ఆరు నెలల క్రితం కల్వకుర్తి జడ్చర్ల ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఊరుకొండ మండల కేంద్రానికి చెందిన గుజ్జరి యాదగిరి వ్యవసాయ భూమిలో కెమికల్స్ వేయడం వల్ల సుమారుగా అర ఎకరం వరి పంట దెబ్బ తిన్నదని ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడంలేదని ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి పోలీసులు మండల అధికారులు ఇలాంటి వాహనాలపై కేసులు నమోదు చేసి మత్స్యకారులను, రైతులను కాపాడాలని కోరారు.
Tags
Jadcherla