Deepawali Special Story : దీపావళి పండుగ బోలెడన్ని సంతోషాల్ని, కాంతుల్ని మోసుకొస్తుంది. హిందూ సంప్రదాయంలో దీపావళి పండుగకు ఒక ప్రత్యేక స్థానముంది. పండుగకు నెల రోజుల ముందు నుంచే ఈసారి దీపావళి, ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ ఉత్సాహంగా ఎదురు చూస్తుంటాం. పెద్దలు కూడా పిల్లల వలే మారిపోయి ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో కాంతులు నింపే పండుగ. ఈ కథనంలో సంప్రదాయ రీతిలో దీపావళి ఎలా జరుపుకోవాలి? లక్ష్మి పూజ ఎలా చేయాలి? పర్యావరణానికి హాని కాకుండా బాణాసంచాలు ఎలా కాల్చాలి? అనే విషయాలు తెలుసుకుందాం.
సంప్రదాయ రీతిలో!
దీపావళి పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. దీపావళి అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని శాస్త్రవచనం. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు నువ్వుల నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేయాలి. అనంతరం ఇంటి ముందు చక్కగా రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఇంటిని మామిడాకులతో, పూలమాలలతో అలంకరించాలి. పూజామందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాదికాలు యధావిధిగా చేసుకోవాలి. అనంతరం పిండివంటలతో బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి. ఇక దీపావళి సంబరమంతా సాయంత్రం వేళలోనే!
దీపావళి అంటే గుర్తొచ్చేవి ఇవే!
దీపావళి పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చే అంశాలు దీపాలు, లక్ష్మీపూజ, మిఠాయిలు, బాణాసంచా. ఈ నాలుగింటి మేళవింపే దీపావళి. ఈ నాలుగు అంశాల గురించి ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం.
దీపాలు
దీపావళి పండుగ పేరులోనే దీపాలు ఉన్నాయి. దీపావళి అనే పదానికి అర్ధం ఏమిటంటే 'దీప' అంటే దీపాలు, 'ఆవళి' అంటే వరుస అని అర్ధం. దీపాలను వరుసగా పెడతాం కాబట్టి ఈ పండుగకు దీపావళి అని పేరు వచ్చింది. దీపం చీకటిని పారద్రోలి వెలుగును అందిస్తుంది. దీపావళి సాయంత్రం వెలిగించే దీపాలతో అజ్ఞానం, దుఃఖం అనే చీకట్లు నశించి జ్ఞానం, సంతోషం అనే వెలుగులు విరజిమ్ముతాయని విశ్వాసం.
దీపాలు ఎలా వెలిగించాలి?
దీపావళి నాటి సాయంత్రం మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి. తొలి దీపం గణపతి వద్ద, రెండో దీపం లక్ష్మీదేవి సమక్షంలో మూడవ దీపం తులసి కోట వద్ద, నాలుగు, ఐదు దీపాలు ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా వెలిగించాలి. తరువాత ఇంటి అలంకరణ కోసం ఎన్ని దీపాలు కావాలంటే అన్ని వెలిగించుకోవచ్చు. దేవుని సమక్షంలో వెలిగించే దీపాలలో అక్షింతలు, రూపాయి కాసు వేయడం మర్చిపోవద్దు.
లక్ష్మీ పూజ
దీపావళి నాటి సాయంత్రం ఇల్లు వాకిలి దీపాలతో అలంకరించి చక్కగా లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. ఇక శాస్త్రోక్తంగా లక్ష్మీపూజ చేసుకోవాలి. ఒక పీటపై లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి అమ్మవారిని గులాబీలు, కలువపూలు, గంధం కుంకుమలతో అలంకరించాలి. అమ్మవారి సమక్షంలో దీపాలు వెలిగించాలి. సాంబ్రాణి ధూపం వెయ్యాలి. అనంతరం శ్రీలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. కనకధారా స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించాలి. అమ్మవారి ముందు డబ్బు, బంగారం, వెండి, కొత్త బట్టలు ఉంచి పూజించాలి. గుజరాత్ రాష్ట్రంలో వ్యాపారాలు ఈ రోజు కొత్త ఖాతా పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచి పూజిస్తారు. పూజ పూర్తయ్యాక అమ్మవారికి ప్రీతికరమైన మిఠాయిలు, ఖీర్ వంటి నైవేద్యాలు సమర్పించాలి. చివరగా పచ్చ కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి. ఇంట్లోని కుటుంబ సభ్యులంతా ఈ లక్ష్మీపూజలో పాల్గొనాలి. ఈ విధంగా శాస్త్రోక్తంగా లక్ష్మీపూజ చేసుకుంటే ఆ ఏడాది మొత్తం సిరి సంపదలకు లోటుండదని విశ్వాసం.
నోరూరించే మిఠాయిలు
దీపావళి అనగానే నోరూరించే మిఠాయిలు గుర్తుకు వస్తాయి. దీపావళి రోజు ప్రతి ఇంటా మిఠాయిలు తయారు చేస్తారు. అలాగే లక్ష్మీపూజలోలక్ష్మీదేవికి కూడా మిఠాయిలనే నైవేద్యంగా పెడతారు. అంతేకాదు దీపావళి నాటి సాయంత్రం బంధు మిత్రులు, ఇరుగుపొరుగువారు ఒకరికొకరు మిఠాయిలు ఇచ్చి పుచ్చుకోవడం ఒక సంప్రదాయం. కార్యాలయాల్లో యాజమాన్యాలు కూడా తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి సందర్భంగా మిఠాయిలు పంచి పెడతారు. అందుకే దీపావళి పండుగకు, మిఠాయిలకు అవినాభావ సంబంధముంది. ఇక దీపావళి మిఠాయిల్లో మోతీచూర్ లడ్డు, గులాబ్ జాం, జిలేబి వంటి సాంప్రదాయ మిఠాయిలతో పాటు రసగుల్లా వంటి బంగాలీ స్వీట్లకు కూడా అగ్రస్థానముంది.
బాణాసంచాతో అసలు ఆనందం!
దీపావళి వేడుకల్లో చివరిది అత్యంత ప్రధానమైనది బాణాసంచా కాల్చడం. పెద్దలు కూడా పిల్లలు గా మారిపోయే ఈ బాణాసంచా వేడుకలు దీపావళి పండుగ సంబరాలను పదింతలు పెంచుతాయి. అయితే ఏదైనా హద్దుల్లో ఉంటేనే అందం, ఆనందం. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే పెద్ద పెద్ద ఆటంబాంబులు వంటివి కాల్చక పోవడమే మంచిది. వీటి స్థానంలో నేల టపాసులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు, రాకెట్లు, కాకరపువ్వొత్తులు, మతాబులు ఇలా వెలుగులు విరజిమ్మే టపాసులతో దీపావళి ఆనందం రెట్టింపవుతుంది.
హద్దుల్లో ఉంటేనే ఆనందం!
విపరీతమైన శబ్దాలు వచ్చే టపాసులతో ఇటు పశుపక్ష్యాదులకు, అటు పసిపిల్లలు, పెద్దవారికి, గుండె జబ్బులు ఉండేవారికి కూడా ప్రమాదమే! పర్యావరణానికి హాని కలిగించే కెమికల్స్ తో తయారైన టపాసులు కాల్చకపోవడమే మంచిది. వీటివలన విపరీతమైన వాయు కాలుష్యం పెరుగుతుంది. ఇటీవల ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బాణాసంచా నిషేధించడం కూడా ఇందుకు నిదర్శనమే! మన ఆనందం కోసం ప్రకృతిని విధ్వంసం చేయకూడదు కదా!
కొత్తగా వీటిని ప్రయత్నించండి
ఈ మధ్య బాణాసంచాలో కూడా కొత్త రకాలు వస్తున్నాయి. వాటిల్లో గ్రీన్ క్రాకర్స్, సీడ్ క్రాకర్స్ ను మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఈ దీపావళికి ప్రయత్నిద్దాం.
ఇది కదా అసలైన దీపావళి!
పండుగంటే ఆనందాన్ని, సంతోషాన్ని పంచుకోవడం, కుటుంబంతో సరదాగా గడపడం. అంతేకానీ పండుగ పేరుతో ప్రకృతి విధ్వంసానికి పూనుకోవడం క్షమించరాని నేరం. ఈ విధముగా పర్యావరణ హితమైన దీపావళిని మనం పాటించి చూపిస్తే తరువాతి తరం కూడా మనల్ని అనుసరించడం ఖాయం. పచ్చని కాలుష్యం లేని ప్రకృతిని రాబోయే తరాలకు అందించడమే కదా నిజమైన సౌభాగ్యం! అదే కదా అచ్చమైన దీపావళి ఆనందం! మరి ఈ దీపావళి పండుగను మనమందరం ఇలా ఆనందంగా జరిపేసుకుందాం. అందరికి దీపావళి శుభాకాంక్షలు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం