12 రాశులకు 12 జ్యోతిర్లింగాలు! మీ రాశికి ఏ శివక్షేత్రం శుభం తీసుకువస్తుందో తెలుసా?


 12 Jyotirlingas Zodiac Signs : దేశంలోని శైవ క్షేత్రాల్లో ముఖ్యమైనవి ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలసిన ఆలయాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాలను సాక్షాత్తు దేవతలే నిర్మించారని పురాణ వచనం. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. పన్నెండు జ్యోతిర్లింగాలు రాశి చక్రంలోని ఒక్కో రాశితో ముడిపడి ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలకు ద్వాదశ రాశులకు ఉన్న సంబంధం ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిర్లింగ దర్శనం మోక్షదాయకం
కార్తిక మాసంలో శైవ క్షేత్రాలను దర్శించడం, శివారాధన చేయడం మోక్ష దాయకమని పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశ రాశుల్లో జన్మించిన వ్యక్తులు తమ రాశికి చెందిన జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించడం, ఆ శ్లోకాలను స్మరించడం వలన దోషాలు తొలగి శుభాలు జరుగుతాయని విశ్వాసం. ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి- జ్యోతిర్లింగం రామేశ్వరం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి కుజుడికి స్వగృహం. ఇది చరరాశి. కాబట్టి వీరికి పదకొండవ ఇంట శని బాధకుడు. గ్రహపీడనా నివారణార్థం ఈ రాశివారు తమిళనాడులో రామేశ్వరం లో వెలసిన రామేశ్వరాన్ని దర్శించాలి. శ్రీరాముడు శని దోష నివారణార్థం రామేశ్వరంలో శివలింగాన్ని స్థాపించాడని ప్రతీతి.

పఠించాల్సిన శ్లోకం
ఈ రాశి వారు ‘సుత్రామ పర్ణీ జరరాషి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యే శ్రీరామ చంద్రేన సమర్పితం, రామేశ్వరాఖ్యం నియతం నమామి’ అనే శ్లోకం రోజూ పఠించాలి. రామేశ్వరం దర్శనంతో మేషరాశి వారికి సకల గ్రహపీడలు తొలగిపోయి శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం.

వృషభరాశి- జ్యోతిర్లింగం సోమనాథ్
వృషభరాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చంద్రునికి ఉచ్ఛ రాశి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించాడు. వృషభ రాశి వారు శని దోష శాంతికి సోమనాథ్ దేవాలయాన్ని దర్శించడం శుభప్రదం.

పఠించాల్సిన శ్లోకం
ఈ రాశివారు ‘సౌరాష్ట్ర దేశే విదేశేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం, భక్తి ప్రాదానాయ క్రుపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని రోజూ పారాయణ చేయడం శుభకరం. ఈ రాశి వారు తమ జన్మ నక్షత్రంలో సోమనాథ్‌లో రుద్రాభిషేకం చేయించుకుంటే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు పొందుతారు.

మిథునరాశి- జ్యోతిర్లింగం నాగేశ్వరం
మిథునరాశికి అధిపతి బుధుడు. ఈ రాశివారు గ్రహదోష పరిహారార్థం గుజరాత్‌లోని నాగేశ్వర క్షేత్రాన్ని దర్శించాలి. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలసినట్లుగా తెలుస్తోంది.

పఠించాల్సిన శ్లోకం
మిథునరాశి వారు ప్రతిరోజూ ‘యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భోగై, సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని పఠించాలి. ఈ రాశిలో శని సంచరించేటప్పుడు కైలాస యంత్ర ప్రస్తార మహాలింగార్చన చేయిస్తే విశేష ఫలితం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

కర్కాటక రాశి- జ్యోతిర్లింగం ఓంకారేశ్వరం
కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు అందుకే కర్కాటక రాశి వారు ఓంకారేశ్వర లింగాన్ని దర్శనం చేసుకుంటే శుభం జరుగుతుందని విశ్వాసం. ఓంకారేశ్వరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖాండ్వా జిల్లాలో, పవిత్ర నర్మదా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ జ్యోతిర్లింగం.

పఠించాల్సిన శ్లోకం
కర్కాటక రాశి వారు ప్రతి నిత్యం ‘కావేరికా నర్మదాయో పవిత్రే సమాగమే సజ్జన తారణాయ, సడైవమాన్దాత్రు పురే వసంతం, ఓంకార మీశం శివమే మీధ్యే’ అనే శ్లోకం పఠించాలి. అంతేకాకుండా ఈ రాశి వారు తమ జన్మ నక్షత్రం ఉన్న రోజున ఓంకార బీజాక్షరం జపించడం అత్యంత శుభకరమని పండితులు చెబుతున్నారు.

సింహరాశి- జ్యోతిర్లింగం ఘృష్ణేశ్వరం
సింహరాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో వెలసిన ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శించడం మంచిది.

పఠించాల్సిన శ్లోకం
సింహరాశి వారు ‘ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సముల్లసాంతం చ జగద్వ రేణ్యం, వందే మహాదారాతర స్వభావం, ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని నిత్యం పఠించడం ద్వారా సర్వదోషాల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం.

కన్య రాశి -జ్యోతిర్లింగం శ్రీశైలం
కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ రాశి వారు అన్నిరకాల గ్రహ బాధల నుంచి ఉపశమనం పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లాలోని శ్రీశైల మల్లికార్జునుని దర్శించి, భ్రమరాంబకు కుంకుమ సమర్పించాలి. అంతేకాకున్న తమ జన్మ నక్షత్రం రోజున చండీ హోమం చేసుకోవడం కూడా శుభకరం.

పఠించాల్సిన శ్లోకం
కన్యారాశి వారు ‘శ్రీశైల శృంగే విభుధాతి సంగే తులాద్రి తుంగేపి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం’ అనే శ్లోకాన్ని ప్రతిరోజూ పఠించడం శ్రేయస్కరం.

తుల రాశి- జ్యోతిర్లింగం మహాకాళేశ్వరం
తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లో వెలసిన ప్రసిద్ధ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వరుని దర్శించడం వలన సలక గ్రహ దోషాలు తొలగి శుభాలు పొందుతారు.

పఠించాల్సిన శ్లోకం
తులారాశి వారు శుక్రవారం సూర్యోదయ సమయంలో ‘ఆవన్తికాయం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం, అకాల మ్రుత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం’ అనే శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని గ్రహదోషాల నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు.

వృశ్చిక రాశి- జ్యోతిర్లింగం వైద్యనాథేశ్వర
వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. ఈ రాశివారు మహారాష్ట్రలోని పర్లి వద్ద వెలసిన వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించడం శుభప్రదం. ఈ రాశి వారిలో ఎక్కువమంది వైద్య వృత్తిలో రాణిస్తారు. వైద్యనాథేశ్వరుని దర్శించడం వలన సకల రోగాల నుంచి విముక్తి లభించడం మాత్రమే కాకుండా రోగాలను నయం చేసే వైద్య వృత్తిలో కూడా చక్కగా రాణిస్తారు.

పఠించాల్సిన శ్లోకం
వృశ్చికరాశి వారు ప్రతి మంగళవారం ‘పూర్వోత్తరె ప్రజ్వాలికాని ధానే, సాదావసంతం గిరిజాసమేతం, నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం తమహం నమామి’ అనే శ్లోకాన్ని పఠిస్తే శుభం జరుగుతుందని విశ్వాసం.

ధనుస్సు రాశి- జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వర
ధనుస్సు రాశికి అధిపతి బృహ‌స్పతి. ‘ఈ రాశివారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో వెలసిన కాశీ విశ్వేశ్వరుని దర్శించడం వలన అన్ని గ్రహ దోషాల నుంచి ఉపశమనం పొందుతారని విశ్వాసం.

పఠించాల్సిన శ్లోకం
ధనుస్సు రాశి వారు 'సానందవనే వసంతం.. ఆనందకందం హతపాప బృందం వారణాసీనాథ మనాథనాథం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే’ అనే శ్లోకాన్ని నిరంతరం పారాయణ చేయాలి. వారణాసిని దర్శించి, గురువారం నాడు శనగలు దానం ఇవ్వడం వల్ల శని, గురు గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చునని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు.

మకర రాశి- జ్యోతిర్లింగం భీమశంకర
మకరరాశికి అధిపతి శని. ఇది గురునికి నీచ, కుజునికి ఉచ్ఛ దశకు కారణమవుతుంది. ఈ రాశివారు మహారాష్ట్రలో పూణేకు సమీపంలో వెలసిన భీమశంకర దర్శనం వల్ల తెలిసో, తెలియకో చేసిన దోషాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వాసం.

పఠించాల్సిన శ్లోకం
మకరరాశి వారు ప్రతిరోజూ ‘యం ఢాకినీ శాకిని కాసమాజైః నిషేమ్యమాణం పిశితశనైశ్చ, సదైవ భీమాదిపద ప్రసిద్ధం, తం శంకరం భూతహితం నమామి’ అనే శ్లోకాన్ని పారాయణ చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఈ రాశి వారు శనివారం నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు దానం చేయడం, దివ్యాంగులు, ముసలివారికి వస్త్ర దానం వల్ల మంచి జరుగుతుంది.

కుంభరాశి- జ్యోతిర్లింగం కేదారేశ్వరం
కుంభరాశికి అధిపతి వరుణుడు. ఈ రాశివారు గ్రహపీడలు, శత్రుబాధలు, ఇతర దోషాల విముక్తి కోసం హిమాలయ సానువుల్లో వెలసిన కేదారేశ్వరుని దర్శించుకోవడం వలన సకల గ్రహ దోషాల నుంచి విముక్తి పొందుతారు.

పఠించాల్సిన శ్లోకం
కుంభరాశి వారు ప్రతి రోజు ‘నిత్యం మహాద్రి పార్శ్వేచ మునీంద్రైః సురాసురై ర్యక్ష మహోరగాద్యైః కేదారమీశం శివమేక మీడే’ అనే శ్లోకాన్ని పారాయణం చేయాలి. శనివారం శివునికి రుద్రాభిషేకం జరిపిస్తే మంచిది.

మీనరాశి- జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం
మీనరాశికి అధిపతి ఇంద్రుడు. ఈ రాశి వారు మహారాష్ట్ర నాసిక్ సమీపంలోని గోదావరి నది జన్మస్థలం వద్ద వెలసిన త్య్రంబకేశ్వరుని దర్శించుకోవడం శుభప్రదం. త్రయంబకేశ్వర లింగం ఎప్పుడూ నీటిలో ఉంటుంది. త్య్రంబకేశ్వర దర్శనం, స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచుకోవడం వల్ల ఈ రాశివారికి మేలు జరుగుతాయి. ‘

పఠించాల్సిన శ్లోకం
మీనరాశి వారు ప్రతిరోజూ 'నిత్యం సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాత్ పాతకమాశునాశం, ప్రయాతి తం త్ర్యంబక మీశ మీడే’ అనే శ్లోకాన్ని పారాయణం చేయడం సకల శుభాలను కలిగిస్తుంది. కార్తిక మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు జన్మ రాశులకు అనుగుణంగా దర్శించుకోవడం వలన సకల గ్రహ దోషాలు తొలగి, సర్వ శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఓం నమః శివాయ!

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow