హైదరాబాద్: ఎవరు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా పట్టించుకోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అడ్డంకులకు నిటారుగా నిలబడి తెలంగాణకు కావాల్సిన వాటా సాధించి ఎస్.ఎల్.బి.సిని పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ను తరిమికొట్టి, 3.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. గుజరాత్‌లో నర్మదా నది, యూపీలో యమునా నదిని శుద్ది చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు అడ్డంకులు కలిగిస్తున్నారని మండిపడ్డారు.
జీవన ప్రమాణాలు పెంచడమే మూసీ పునరుజ్జీవం..
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి బ్రతుకుదెరువు కోసం వచ్చిన వారు మూసీ పక్కన నివసిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మూసీకి వరద వచ్చినప్పుడు కొట్టుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసి పక్కన నివాసిస్తున్న వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు మూసీ పునరుజ్జీవనం చేస్తున్నామని వివరించారు. వారికి ఉద్యోగ, ఆర్థిక అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచడమే మూసీ పునరుజ్జీవం లక్ష్యమని పేర్కొన్నారు. మత సామరస్యానికి దిక్సూచిగా మూసీ వెంట అనేక కట్టడాలు కట్టారని తెలిపారు. మూసీ పునరుజ్జీవం చేసి తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెడతామని చెప్పారు.
Tags
Telangana