జడ్చర్ల: ఇంట్లో ఉన్న మైనర్ బాలిక పట్ల హోటల్లో
పనిచేస్తున్న ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహించిన తండ్రి యువకుడని మందలించాడు. దీంతో యువకుడికి చెందిన గ్యాంగ్ ఒక్కసారిగా బాలిక తండ్రితో పాటు మరో యువకుడిని కర్రలతో దాడికి దిగిన ఘటన జడ్చర్ల పట్టణంలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ జిల్లాకు చెందిన గ్యాబ్రియల్ కుటుంబం జడ్చర్ల పట్టణంలో గల నక్షత్ర హోటల్ వెనకాల అద్దెకు ఉంటున్నారు. మైనర్ బాలిక తండ్రి ఓ ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, తొమ్మిదో తరగతి చదువుతున్న కూతురు, ఐదవ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. వీరు ఆదివారం పెద్దల అమావాస్య సందర్భంగా తిమ్మాజీపేట అప్పాజీపల్లి గ్రామమైన తమ అత్తగారి ఇంటికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు.
తండ్రి సామాన్లు తీసుకొని ఇంట్లోకి వెళ్లగా.. మెట్లు ఎక్కి వెళ్తున్న మైనర్ బాలికను నక్షత్ర హోటల్లో సూపర్వైజర్ పనిచేస్తున్న కృష్ణారెడ్డి అనే యువకుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు గోడపై ఒక ఫోన్ నంబర్ రాయడంతో సదరు బాలిక తండ్రికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహించిన బాలిక తండ్రి హోటల్లోకి వెళ్లి యువకుడిని మందలించడంతో పాటు కొట్టినట్లు తెలిపారు. ఇదే విషయం సదరు యువకుడు తన అన్నతో పాటు స్నేహితులకు తెలియజేయడంతో ఆవేశంతో వచ్చిన వారు ఒక్కసారిగా అక్కడున్న మైనర్ బాలిక తండ్రిపై కర్రలతో దాడి చేయడం ప్రారంభించారు.
ఇదే సమయంలో నవాబుపేట మండలానికి చెందిన జనార్దన్ అనే యువకుడు సంకల్ప హోటల్లో విధులు ముగించుకొని ఇంటికి వస్తుండగా దాడి జరగడం చూసి వారిని ఆపేందుకు వెళ్లడంతో అతడిపై కూడా విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. బాదితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దాడి చేసిన యువకుడిని రక్షించేందుకు అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు రంగంలోకి దిగి పోలీసులతో కేసు నమోదు కాకుండా మేము మాట్లాడుకుంటాం అనే విధంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సదరు మైనర్ బాలిక దళిత బాలిక అని తెలియడంతో వారిని ఒప్పించేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
