అరబిందో ఫ్యాక్టరీ ని పేల్చేస్తా.అధికారులకు, అరబిందోకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అల్టిమేటం

 *అరబిందో ఫార్మాను ఆదివారం తగులబెడతా*


• ఒక్కరోజులో అధికారులు చర్యలు తీసుకోని పక్షంలో అన్నంత పని చేస్తా

• అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు • తగులబెడతానని హెచ్చరించినా అరబిందో పట్టించుకోవడం లేదు • రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇక చూస్తూ ఊరుకోలేను • అధికారులకు, అరబిందోకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అల్టిమేటం • మీడియాకు ఫోటోలు, వీడియోల విడుదల జడ్చర్ల, సెప్టెంబర్ 26: అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా, పలుమార్లు హెచ్చరించినా అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదలడం ఆపడం లేదని, ఈ వ్యవహారంలో తక్షణం చర్యలు తీసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలికి ఒక్క రోజు టైమ్ ఇస్తున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అల్టిమేటం ఇచ్చారు. ఈ ఒక్క రోజులో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చర్యలు తీసుకోకపోతే ఆదివారం 11 గంటలకు అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి ఆ కంపెనీని తగులబెడతానని హెచ్చరించారు. ప్రస్తుతం తన కుటుంబంతో కర్నాటక యాత్రలో ఉన్న అనిరుధ్ రెడ్డి ఈ మేరకు ఒక వీడియోను శుక్రవారం మీడియాకు విడుదల చేసారు. పోలేపల్లి ఫార్మా సెజ్ లోని అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న కారణంగా పంటలు పండడం లేదని, చెరువులో ఉన్న చేపలతు కూడా చనిపోతున్నాయని తాను గతంలోనే అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోలేదని చెప్పారు. ఈ విషయంలో అధికారులకు అరబిందో ఫార్మాకు మధ్య ఏ లాలూచీ ఉందో తనకు తెలియదన్నారు. మరోసారి కలుసిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని, మరోసారి అలా చేస్తే అరబిందో ఫార్మా కంపెనీని తగుల బెడతానని గతంలోనే తాను హెచ్చరించానని గుర్తు చేసారు. అయినప్పటికీ తన హెచ్చరికలను పెడచెవిన పెట్టి అరబిందో ఫార్మా కంపెనీ మళ్లీ కలుషిత జలాలను చెరువులోకి వదులుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసారు. కలుషిత జలాలను చెరువులోకి వదలడం వెంటనే ఆపాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. అరబిందో పై చర్యలు తీసుకోవడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు శనివారం ఒక్క రోజు గడువు ఇస్తున్నానని అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఈ ఒక్క రోజులో చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు తాను అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి దాన్ని తగలబెడతానని హెచ్చరించారు. రైతులు నష్టపోతున్నా చూస్తూ ఊరుకొనే ఓపిక తనకు లేదన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అరబిందో పై చర్యలు తీసుకుంటారో, లేక దాన్ని తగలబెట్టకతప్పని పరిస్థితి తీసుకొస్తారో వాళ్ల ఇష్టమని పేర్కొన్నారు. ఫోటోవార్త: ముద్దిరెడ్డి పల్లి చెరువులోకి అరబిందో ఫార్మా వదులుతున్న కలుషిత జలాలు. - వీడియోలో మాట్లాడుతున్న అనిరుధ్ రెడ్డి.
Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow