ప్రైవేట్ టీచర్ల సమస్యను అసెంబ్లీలో కూడా లేవనెత్తుతా


పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజు దగ్గర కన్సీజన్ ఇవ్వండి

*ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు ఎక్కువ.. టీచర్లకు జీతాలు తక్కువ*

• ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు తగ్గించి పేద విద్యార్థులను ఆదుకోవాలి

• టీచర్లకు వారి శ్రమకు తగిన వేతనాలివ్వాలి

• ట్రిపుల్ ఐటీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

• ప్రైవేట్ టీచర్ల సమస్యను అసెంబ్లీలో కూడా లేవనెత్తుతా

• విద్యా ప్రమాణాల పెంపు కోసం కృషి చేస్తా

• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హామీ

• జడ్చర్లలో ఘనంగా ప్రైవేటు ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం 

జడ్చర్ల, సెప్టెంబర్ 16: ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు ఎక్కువగా ఉంటాయని, అయితే ఆ పాఠశాలల్లో పని చేసే టీచర్లకు మాత్రం జీతాలు చాలా తక్కువగా ఉంటాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేటు టీచర్ల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని వారి సమస్యలను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. మార్కులు తక్కువ ఉంటే ఎవరు సిఫార్సు చేసినా ట్రిపుల్ ఐటీలో సీట్లు రావని, అందుకే విద్యార్థులు కష్టపడి చదివి మార్కులు తెచ్చుకోవడం ద్వారా ట్రిపుల్ ఐటీని సద్వినియోగం చేసుకోవాలని హితవు చెప్పారు.

మంగళవారం జడ్చర్ల కేంద్రంలోని చంద్ర గార్డెన్ లో నిర్వహించిన ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు JRSMA అవార్డు ప్రదానోత్సవ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ,“గురువే గోవిందుడు – ఉపాధ్యాయుడే భవిష్యత్తుకు మార్గదర్శి. ఒక వైద్యుడు ఒక్క రోగిని కాపాడతాడు, ఒక ఇంజనీరు ఒక్క ప్రాజెక్టు నిర్మిస్తాడు కానీ ఉపాధ్యాయుడు ఒక తరాన్ని తీర్చిదిద్దుతాడని’’ కితాబిచ్చారు. టీచర్లు అందిస్తున్న జ్ఞానం వల్లే సమాజం అభివృద్ధి దిశగా సాగుతోందని చెప్పారు. నేటి పిల్లలు భావి భారత పౌరులుగా ఎదగడానికి కారణం గురువులు మాత్రమేనని పేర్కొన్నారు. టీచర్లు ఏడాదిలో 365 రోజులు కూడా పని చేస్తారన్నారు. ఉపాధ్యాయ వృత్తి అంటే కేవలం ఉద్యోగం కాదని, అది ఒక త్యాగం, ఒక సేవ అని నిస్వార్థంగా సమాజం కోసం, విద్యార్థుల కోసం టీచర్లు అందిస్తున్న సేవకు ఈ అవార్డులు ఒక గుర్తింపు అని చెప్పారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడటంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల పాత్ర కూడా అపారమైనదనీ అభిప్రాయపడ్డారు. జడ్చర్ల నియోజకవర్గంలో విద్యా ప్రమాణాలు మరింత పెంచడానికి తాను, తన వంతుగా కృషి చేస్తానని పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేస్తానని, డిజిటల్ ఎడ్యుకేషన్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడానికి కృషి చేస్తానన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలో యజమాన్యాలు పేద విద్యార్థులకు ఫీజులను తగ్గించి అందరూ చదువుకొనేందుకు అవకాశం ఇవ్వాలని అనిరుధ్ రెడ్డి కోరారు. అధిక ఫీజులతో పేద విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో బోధిస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలను పెంచి వారిని ఆదుకోవాలని కోరారు. ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ సమస్యలకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అవకాశం వస్తే మాట్లాడుతానని తెలిపారు. విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తే జడ్చర్ల సమీపంలో ఉన్న త్రిబుల్ ఐటీ పాఠశాలలో చదువుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు. కటాఫ్ కంటే తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే కాదు కదా సీఎం చెప్పినా ట్రిపుల్ ఐటీలో సీటు రాదని, అందుకే విద్యార్థులు కష్టపడి చదువుకోవడం ద్వారా ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించాలని హితవు పలికారు. రాబోయే దసరా నవరాత్రి ఉత్సవాలను అందరితో కలిసి ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలత, మార్కెట్ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి, స్థానిక కౌన్సిలర్ లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


• *

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow