నెలాఖరునుంచే జడ్చర్లలో వరద కాల్వల నిర్మాణం • రూ.14 కోట్లతో పూర్తయిన టెండర్లు



నెలాఖరునుంచే జడ్చర్లలో వరద కాల్వల నిర్మాణం

• రూ.14 కోట్లతో పూర్తయిన టెండర్లు

• ఈనెలలో శంఖుస్థాపనతో ప్రారంభం కానున్న పనులు

• వచ్చే వర్షకాలం నుంచి రోడ్లపై నీళ్లు నిలువకుండా చర్యలు

• ప్రమాదకర వాగులపై రూ.44 కోట్లతో వంతెనలు

• భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

• రహదారులపై ఉధృతంగా ప్రవహించే వాగులను దాటే ప్రయత్నం చేయొద్దు

• పాత ఇళ్లలో, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వారు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి

• అధికారులందరూ అప్రమత్తంగా 24 గంటలూ ప్రజలకు అందు బాటులో ఉండాలి

• ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ


జడ్చర్ల, ఆగష్టు 14: భారీ వర్షాలు కురుస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కోరారు. జడ్చర్ల పట్టణంలో వరద నీటి కాల్వల నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వచ్చే ఏడాది లోపుగా ఈ కాల్వల నిర్మాణం కూడా పూర్తి చేసి రోడ్లపై వర్షపు నీరు నిలవకుండా చూస్తామని చెప్పారు. నియోజకవర్గంలో వర్షా కాలంలో వాగులు ప్రమాదకరంగా ప్రవహించే తొమ్మిది ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాన్ని కూడా వచ్చే ఏడాదిలో పూర్తి చేయిస్తామని తెలిపారు.

జడ్చర్ల నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ జన జీవనం అస్తవ్యస్తమౌతున్న నేపథ్యంలో గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో అనిరుధ్ రెడ్డి ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా వాన నీటి కష్టాల నుంచి ప్రజలను రక్షించడానికి తీసుకుంటున్న చర్యలను గురించి వివరించారు. భారీ వర్షాలు మరో రెండు, మూడు రోజులు కొనసాగనున్న పరిస్థితుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వర్షాలు ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా కంచెలు లేని ట్రాన్ఫార్మర్ల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విద్యుత్ తీగలు తెగిపడటం లాంటి సంఘటనలను గురించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రహదారులపై ఉండే వాగులు ప్రమాదకరమైన స్థాయిలో ప్రవహిస్తున్నప్పుడు వాటిని దాటే ప్రయత్నం చేయకూడదని, వాగుల ఉధృతి తగ్గే వరకూ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని హితవు చెప్పారు. రాత్రి వేళల్లో ఇలాంటి వాగుల ఉధృతిని అంచనా వేయడం కష్టమౌతుందన్నారు. పెద్ద చెరువులు నిండినప్పుడు వాటి కట్టలు ఎక్కడైనా లీక్ అవుతూ తెగి పోయే ప్రమాదం ఉందని గుర్తిస్తే ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. శిధిలావస్థలో ఉన్న పాత ఇళ్లలో ఉంటున్న వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని వర్షాలు ఆగిపోయేవరకూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అనిరుధ్ రెడ్డి హితవు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవడానికి విద్యుత్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. 

ఈ నెలాఖరు నుంచే వరద కాల్వల నిర్మాణం:

కాగా కొద్ది పాటి వర్షానికే జడ్చర్ల పట్టణంలోని రహదారులు జలమయమైపోతూ, జన జీవనం అస్తవ్యస్తమౌతున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వరద నీటి కాల్వలు (స్ట్రామ్ వాటర్ డ్రైన్స్) నిర్మాణానికి టియుఎఫ్ ఐడిసి ద్వారా రూ.14 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని అనిరుధ్ రెడ్డి ప్రస్తావిస్తూ దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం పూర్తయిందని వెల్లడించారు. ఈ నెలాఖరులోపుగా వీటి నిర్మాణానికి శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన అధికారులతో అధ్యయనం చేయించి వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా ప్రణాళికాబద్ధంగా వరద కాల్వలను నిర్మిస్తామని చెప్పారు. వీటి నిర్మాణం వచ్చే ఏడాది వర్షకాలంలోపుగా పూర్తి చేయడం ద్వారా వర్షపు నీళ్లు రోడ్లపై నిలువ కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

ప్రమాదకర వాగులపై 9 వంతెనల నిర్మాణం:

కాగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వర్షాకాలంలో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ రాకపోకలకు ఆటంకం కలిగించడంతో పాటుగా ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ప్రాంతాలను గుర్తించడం జరిగిందని అనిరుధ్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గంలో మొత్తం తొమ్మిది చోట్ల వాగులపై వంతెనలు నిర్మించాలనే విషయాన్ని గుర్తించామన్నారు. జడ్చర్ల మండలం లింగంపేట నుంచి నల్లకుంట తాండాకు వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, ఎక్వాయిపల్లి నుంచి లింగంధన వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, నెక్కొండ నుంచి బైరంపల్లి వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు, కొండేడు నుంచి తుపడగడ్డ తాండా మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. అలాగే బాలానగర్ మండలంలో జాతీయ రహదారి నుంచి ఉడిత్యాల, మోతీఘనపూర్, సూరారం మార్గంలో బ్రిడ్జి నిర్మాణానికి రూ.3 కోట్లు, శేరిగూడ నుంచి బోడజానంపేట్ కు వెళ్లే రోడ్డులో వంతెన నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని చెప్పారు. నవాబుపేట మండలంలో వీరశెట్పల్లి నుంచి దయాపంతులపల్లి మీదుగా హాజీపూర్ వెల్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.2.40 కోట్లు ప్రతిపాదించామన్నారు. రాజాపూర్ మండలంలో రాయపల్లి నుంచి కుచ్చర్కల్ వెళ్లే రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి రూ.6 కోట్లు, మిడ్జిల్ మండలంలో వల్లభరావుపల్లి నుంచి చౌటకుంటతాండా మీదుగా వేముల వెళ్లే మార్గంలో వంతెన నిర్మాణానికి రూ.10.20 కోట్ల చొప్పున మొత్తం తొమ్మిది వంతెనల కోసం రూ.44.10 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రతిపాదించామని అనిరుధ్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ వంతెనలకు నిధులు మంజూరైన వెంటనే వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయించి వచ్చే ఏడాది లోపుగానే ఈ వంతెనల నిర్మాణాలను కూడా పూర్తి చేయించడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. వీటితో పాటుగా చెరువులు అలుగు పారడం కారణంగా రాకపోకలకు ఆటంకం వాటిల్లో ప్రాంతాల్లో కాజ్ వేలను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిస్తామని అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. కాగా భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు అవసరమైన తాత్కాలిక, శాశ్విత మరమ్మత్తులు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అనిరుధ్ రెడ్డి సంబంధిత అధికారులను కోరారు.


• 

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow