హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు


 హైదరాబాద్, జులై 17: నగరంలోని సనత్‌నగర్‌ సమతనగర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. డ్యూరోడైన్ ఇండస్ట్రీస్‌ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మొత్తం ఆరు ఫైరింజన్లు, ఒక రోబోట్ సహాయంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్లాస్టిక్ ప్లేట్స్, డిన్నర్ సెట్స్ ప్యాకింగ్ వస్తువులు ఉండడంతో భారీగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. అయితే ప్రాణ నష్టం తప్పడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఫైర్ సేఫ్టీ లేదు: డీఎఫ్‌ఓ అధికారి

అగ్ని ప్రమాదం జరిగినట్టు తెల్లవారుజామున 3.56 నిముషాలకు సమాచారం వచ్చిందని హైదరాబాద్ డీఎఫ్‌వో అధికారి శ్రీదాస్ తెలిపారు. అగ్నిప్రమాదంపై  మాట్లాడుతూ.. గోడౌన్‌లో ఉన్న సిబ్బంది అప్రమత్తమై మేనేజ్మెంట్‌కు సమాచారం ఇచ్చారని.. మేనేజ్మెంట్ కాల్ చేసి ఫైర్ విషయం అగ్నిమాపక సిబ్బందికి తెలిపారని చెప్పారు. ప్రమాదం జరిగిన గోడౌన్‌లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని.. డిన్నర్ సెట్స్, బౌల్స్, ప్లాస్టిక్ ప్లేట్స్‌కు సంబంధించిన వస్తువులు గోడౌన్‌లో స్టోర్ చేస్తున్నారని తెలిపారు. మాదాపూర్, పంజాగుట్ట, సికింద్రాబాద్, బాలానగర్ ప్రాంతాల నుంచి ఫైర్ వెహికల్స్ వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారన్నారు. ఫైర్ ఫైటింగ్ రోబోట్‌ను కూడా ఆపరేషన్‌కు వినియోగించినట్లు చెప్పారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని.. గోడౌన్‌లో ఉన్న వ్యర్ధాలన్నీ తొలగిస్తున్నామన్నారు. ప్రమాదాలపై కంపెనీలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో అధికారి శ్రీదాస్ పేర్కొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال