Starlink Internet: ఇంకొన్ని రోజుల్లో దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు.. ప్లాన్స్ ఎలా ఉంటాయంటే..


స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ దేశంలో వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని అందించేందుకు రంగంలోకి దిగుతోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, కోట్లాది మంది భారతీయుల జీవితాలను డిజిటల్ ప్రపంచంతో ముడిపెట్టే అద్భుత ఆవిష్కరణగా నిలవనుంది. అయితే దీని ప్లాన్ ధరలు ఎలా ఉంటాయనేది ఇక్కడ చూద్దాం.


దేశంలో ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలతో సరికొత్త మార్పులకు సిద్ధమవుతోంది. ఈ సేవలు గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీని మరింత పెంచనున్నాయి. ఈ క్రమంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి టెలికాం దిగ్గజాలు తమ వ్యూహాలను సమీక్షించుకునేలా చేయనున్నాయి. స్టార్‌లింక్ ద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు అధిక వేగవంతమైన ఇంటర్నెట్ అందించడం ద్వారా డిజిటల్ ఇండియా లక్ష్యాలను సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించనుంది.

భారీ పెట్టుబడులు

స్టార్‌లింక్ భారతదేశంలో దాదాపు 700-750 లో ఎర్త్ ఆర్బిట్ (LEO) ఉపగ్రహాలను స్థాపించనుంది. ఈ ఉపగ్రహాల స్థాపనకు దాదాపు రూ. 8,000 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందని అంచనా. ఈ ఉపగ్రహాలు 7-8 సంవత్సరాల పాటు సేవలు అందిస్తాయి. అదనంగా వార్షిక నిర్వహణ ఖర్చు రూ.350 కోట్లుగా ఉంటుంది. ఈ భారీ పెట్టుబడి స్టార్‌లింక్ భారత మార్కెట్‌పై నిబద్ధతను స్పష్టం చేస్తుంది.

స్టార్‌లింక్ సేవల ధరలు

స్టార్‌లింక్ సేవలకు అవసరమైన కస్టమర్ ప్రెమిస్ ఎక్విప్‌మెంట్ (CPE) ప్రస్తుతం దాదాపు 400 డాలర్లకు (సుమారు రూ. 33,000) అమ్ముడవుతోంది. ఇది స్థానిక ఉత్పత్తి ద్వారా ఈ ధరను సగానికి తగ్గించే అవకాశం ఉంది. ప్రారంభంలో నెలవారీ సేవా ఛార్జీలు రూ. 11,250 వరకు ఉండవచ్చు. కానీ వినియోగదారుల సంఖ్య 2.5 మిలియన్లకు చేరితే, ఈ ధర నెలకు రూ. 850-1,000 వరకు తగ్గే అవకాశం ఉంది. స్టార్‌లింక్ లీజింగ్ లేదా సబ్సిడీ మోడల్‌ల ద్వారా అందరికీ సేవలను తక్కువ ధరలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దశల వారీగా ప్రారంభం

స్టార్‌లింక్ భారతదేశంలో తన సేవలను దశలవారీగా ప్రారంభించనుంది. ప్రారంభ దశలో నెలవారీ ధరలు 20-25 డాలర్ల (సుమారు రూ. 1,600-2,000) నుంచి మొదలవుతాయి. దీర్ఘకాలంలో ఈ ధరలు 10 డాలర్ల (సుమారు రూ. 850) వరకు తగ్గే అవకాశం ఉంది. అదనంగా, స్టార్ ‌లింక్ B2B (బిజినెస్-టు-బిజినెస్), B2G (బిజినెస్-టు-గవర్నమెంట్) కనెక్షన్‌లపై కూడా ఫోకస్ చేసింది. ప్రభుత్వ నిధులతో గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ, అలాగే ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్‌లను అందించడం ద్వారా తన సేవల ప్రభావాన్ని చూపించనుంది.

జియో, ఎయిర్‌టెల్‌లపై స్టార్‌లింక్ ప్రభావం

ప్రస్తుతం హోమ్ బ్రాడ్‌ బ్యాండ్ మార్కెట్‌లో జియో ఫైబర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే స్టార్‌ లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ తక్కువ ధరల్లో అందుబాటులోకి వస్తే, ఈ సేవలకు గట్టి పోటీ ఎదురవుతుంది. ముఖ్యంగా ఫైబర్ లేదా కేబుల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేని గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో స్టార్‌ లింక్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.

స్టార్‌ లింక్ వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను అందిస్తుంది. ఇది విద్య, వ్యాపారం, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో గ్రామీణ ప్రజలకు కొత్త అవకాశాలను అందించనుంది.

Previous Post Next Post

نموذج الاتصال