Child Marriage: నందిగామలో దారుణం.. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి!
- డబ్బుందని 40 ఏళ్ల వ్యక్తితో సంబంధం కుదిర్చిన మధ్యవర్తి
- మే 28న బలవంతంపు వివాహం
- చదువుకోవాలని ఉందని పాఠశాల హెడ్మాస్టర్ను బాలిక ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి
- బాలిక తల్లి, వరుడు, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై కేసు నమోదు
- రంగారెడ్డి జిల్లా నందిగామలో జరిగిన బాల్య వివాహం కలకలం రేపింది. 13 ఏళ్ల బాలికకు 40 ఏళ్ల వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, చదువును కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్న ఆ బాలిక ధైర్యంగా ఈ అన్యాయాన్ని ఎదిరించి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని ఆశ్రయించింది.
నందిగామకు చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ కుమారుడు, 8వ తరగతి చదువుతున్న కుమార్తెను పోషిస్తోంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లి తన కుమార్తె పెళ్లికి మధ్యవర్తిని ఆశ్రయించింది. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, కందవాడకు చెందిన 40 ఏళ్ల వ్యక్తికి ఆస్తి ఉందని చెప్పి, మధ్యవర్తి ఈ సంబంధాన్ని ఖరారు చేశాడు. దీంతో, మే 28న ఈ బలవంతపు వివాహం జరిగింది.
కానీ, ఈ వివాహం తన ఇష్టానికి వ్యతిరేకమని, తాను చదువుకోవాలనుకుంటున్నానని బాలిక మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి ధైర్యంగా తెలిపింది. వెంటనే స్పందించిన ప్రధానోపాధ్యాయుడు బాలికను నందిగామ తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు. తహసీల్దార్ సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి బాలిక ఫిర్యాదు ఆధారంగా ఆమె తల్లి, వరుడు, మధ్యవర్తి, వివాహం జరిపిన పూజారిపై బాల్య వివాహ నియంత్రణ చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, 2006) కింద కేసు నమోదు చేశారు. అనంతరం, బాలికను సురక్షితంగా రెస్క్యూ హోంకు తరలించారు.
Tags
Telangana