తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను అనుమతించిన సుప్రీం ధర్మాసనం.. వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు వేయాలంటూ బీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చారు సీజేఐ గవాయ్. అదే సమయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించాలనే అంశంపై పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ గవాయ్ ఆదేశించారు.
కాగా, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల కేసుపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు జరిగాయి. స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలనే అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే దానిపై సుప్రీంకోర్టులో సుధీర్ఘ వాదనలు నడిచాయి. ఈ వాదనల అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీన తీర్పు రిజర్వ్ చేశారు జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.
సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వివరాలు..
‘పార్టీ మారిన 10 ఎమ్మెల్యేలపై అనర్హత చర్యలను వీలైనంత త్వరగా లేదా 3 నెలల్లోపు నిర్ణయించాలి. ఏ ఎమ్మెల్యే అయినా.. స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని అడగకూడదు. అలా చేస్తే స్పీకర్ ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజకీయ ఫిరాయింపులు జాతీయ చర్చనీయాంశంగా మారింది. దాన్ని అరికట్టకపోతే.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉంది. వివిధ సందర్భాల్లో ఈ అంశంపై పార్లమెంటులో చేసిన వివిధ ప్రసంగాలను కూడా పరిశీలించాం. రాజేష్ పైలట్.. దేవేంద్ర నాథ్ మున్షి లాగా.. అనర్హత చర్యలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం కోర్టుల ముందు జాప్యాన్ని నివారించడమే. పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కట్టబెట్టారు. ఆర్టికల్స్ 136, 226, 227 లకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారాలు చాలా పరిమితంగా ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసింది. స్పీకర్ ఒక న్యాయనిర్ణేత అధికారిగా వ్యవహరిస్తూనే హైకోర్టు, సుప్రీంకోర్టు అధికార పరిధికి లోబడి ఉండే ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు.’ అని తీర్పులో స్పష్టం చేసిన ధర్మాసనం.
‘స్పీకర్ అలా వ్యవహరిస్తూనే రాజ్యాంగపరమైన రక్షణని పొందలేరు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ 2014 నవంబర్ 22న తీర్పును పక్కన పెడుతున్నాము. ఒక ముఖ్యమైన నిర్ణయంలో శాసనసభ స్పీకర్‌లు ప్రజాస్వామ్యానికి ప్రమాదం కలిగించే ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునే విషయంలో ఆలస్యం చేస్తారు. కాబట్టి, ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేల అనర్హతపై ప్రస్తుతం ఉన్న యంత్రాంగాన్ని పార్లమెంటు సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి చర్యలు సంవత్సరాల తరబడి సాగడం వల్ల అర్థరహితంగా మారుతుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసిన తర్వాత మాత్రమే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరం. 'ఆపరేషన్ సక్సెస్- పేషెంట్ డైడ్' అన్న సూత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
Tags
Telagana