గతంలో జిమ్‌లలో వర్కౌట్లు చేసే వారు ఇక్కసారిగా కుప్పకూలి ప్రాణాలొదిలిన ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నా.. నడుస్తున్నా.. ఆటలాడుతున్నా.. డ్యాన్స్ చేస్తున్నా.. ఒక్కటేమిటి ఏ పని చేస్తున్నా ఉన్నట్లుండి జనాలు పిట్టల్లా రాలి పోతున్నారు. తాజాగా విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి.
హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి శుక్రవారం (జూన్ 6) ఉదయం విధినిర్వహణలో భాగంగా కార్యాలయానికి వచ్చారు. అయితే ఏం జరిగింతో తెలియదుగానీ ఆయన ఉన్నట్లుండి కాసేపటికే సీట్లోనే గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఇటీవల ఆయన కాలికి గాయం కావడంతో కొన్నాళ్ల పాటు సెలవులో ఉన్నారు. దాని నుంచి కోలుకున్న ఆయన ఇటీవల మళ్లీ విధులో చేరారు. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న శ్రీపాల్ రెడ్డి హఠాన్మరణం స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా హన్మకొండ తహసీల్దార్‌గా పనిచేస్తున్న శ్రీ పాల్ రెడ్డి రెవెన్యూ శాఖలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అడిషనల్ కలెక్టర్ వైవి గణేష్, ఆర్డిఓ రమేష్ రాథోడ్ ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు.
కాగా మృతి చెందిన తహశీల్దార్ శ్రీపాల్‌రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన కుటుంబం హనుమకొండలో నివాసం ఉంటున్నారు. అనారోగ్యం నుంచి కోలుకుని విధుల్లో చేరిన తర్వాత ఆయన అంబేద్కర్ నగర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల సమస్యను పరిష్కరించేందుకు తీవ్ర కృషి చేశారు. అంతలోనే గుండెపోటుతో ప్రాణాలొదలడంతో స్థానికులు కన్నీటి పర్యాంతమయ్యారు. ఇక నిన్న బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్, జీహెచ్‌ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కూడా గుండె పోటుతో గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు