దట్టమైన పొగమంచు చుట్టూ కమ్మేస్తే ఎలా ఉంటుంది.. ఏదో తెలియని ఆనందం ఉప్పొంగి పోయేలా చేస్తుంది.. కానీ మంచు చూసి మురిసేలోపు మృతువు తలుపు తడుతుంది.. రహదారుల పై రక్తపు కల్లాప చల్లుతోంది..మంచు కురిసే వేళలో ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలుసా..? రహదారులను కమ్మేస్తున్న ఆ పొగ మంచే ఇప్పుడు ఆయువు తీస్తోంది. బాటసారులను బలి కోరుతోంది.. సూర్యుడు ఉదయించక ముందే ఎన్నో జీవితాల్లో పొగమంచు కారుచీకట్లు కమ్ముకునేలా చేస్తోంది. పొగమంచు. హైవేలపై పొగ పగపట్టింది. బారెడు పొద్దెక్కినా విజుబులిటీ లేక వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం…పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారుతోంది. చలికాలంలో మంచుకురియడం కామనే. కానీ ఇది పొగమంచు. వాయుకాలుష్యంతో ఢిల్లీ ఎలా అతలాకుతలమవుతోందో..అలాంటి పరిస్థితులే మన వరంగల్ హైవేపై కనిపిస్తున్నాయి. నిత్యం ఎన్నో ప్రమాదాలు చూస్తుంటాం… ఘోర రోడ్డు ప్రమాదాల గురించి వింటుంటాం.. కానీ చలి కాలంలో తెల్లవారుజామున జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య కలవర పెడుతోంది.. ముఖ్యంగా ప్రమాదాలు అర్థరాత్రి నుంచి ఉదయం 8 లోపు ఎక్కువగా జరుగుతున్నాయి. కారణం…పొగమంచు.