వేగం పుంజుకున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ - ఈ నెల 24 వరకు అర్హుల ఎంపిక పూర్తి - 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ
New Ration Cards Update in Telangana : హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. అర్హులను గుర్తించేందుకు బల్దియా కమిషనర్ ఇలంబర్తి ఆధ్వర్యంలో గురువారం అధికారులు రంగంలోకి దిగారు. 150 డివిజన్లలో దరఖాస్తుదారులను పరిశీలించారు. కాగా ఈ నెల 24 నాటికి అర్హుల ఎంపికను పూర్తి చేసి, 25న నివేదికను ఆయా జిల్లా కలెక్టర్లు ఇవ్వాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. అర్హులను ప్రభుత్వం వద్దనున్న సమాచారంతో సరిచూసి, 26 నుంచి కొత్త కార్డులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. గ్రేటర్లో 22 లక్షల కుటుంబాల వివరాలను నమోదు చేయగా, అందులో రేషన్ కార్డు లేదని, కొత్త రేషన్ కార్డు కావాలనే అభ్యర్థనలు అందాయి. పరిశీలన అనంతరం 83,285గా లెక్క తేల్చింది. ఇటీవల ఇంటింటి సర్వేలోనూ అనేక మంది రేషన్‌కార్డులు లేనివారు వివరాలు నమోదు చేయించుకున్నారు. కొన్నేళ్లుగా కొత్త కార్డులు ఇవ్వకపోవడం, జన్మించిన శిశువులు, కొత్తగా వచ్చిన కోడళ్ల పేర్లను రేషన్ కార్డుల్లో చేర్చాలంటూ వేలాది మంది అప్లై చేసుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకునే అంశంపై రెండు రోజుల్లో ఆదేశాలు రావొచ్చు. CM Revanth Reddy On New Ration Cards : తెలంగాణలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాల్ని పౌర సరఫరాల శాఖ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది. దరఖాస్తులను 15వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అమలు చేయనున్నట్లు సమాచారం.
ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తులు : కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో మీ-సేవలో దరఖాస్తు చేసే వారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని కంప్యూటరీకరించి అర్హులకు 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి : ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వివాహమయ్యాక పుట్టింటి రేషన్ కార్డుల్లో పేర్లను తీసేసుకున్న మహిళలు, మెట్టినింటి కార్డుల్లో చేర్చాలని దరఖాస్తులు చేశారు. తమ పిల్లల పేర్లు రేషన్ కార్టులో చేర్చాలని తల్లిదండ్రులు అర్జీలు సమర్పించారు. ఇలాంటివి 12 లక్షలకు పైగా వచ్చాయి. వాటిలో 16 లక్షలకు పైగా పేర్లు ఉన్నట్లు తెలిసింది. కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.