తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శన విషయంలో తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీవారి ఆలయంలో దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు (ఎంపీ, ఎమ్మెల్సీ,ఎమ్మెల్యే) సిఫారసు లేఖలను అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీ సిఫార్సు లేఖలపై స్పందించిన స్పీకర్ ప్రసాద్ చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
తిరుమల వెంకన్న తెలుగువారి ఆరాధ్య దైవం. స్వామివారిని తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత స్వామివారి దర్శనం విషయంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని తెలంగాణ ప్రజా ప్రతినిధులు గత కొంత కాలంగా నిరసన గళం వినిపిస్తున్నారు. అంతేకాదు తిరుమల వెంకటేశ్వర స్వామితో వందల సంవత్సరాలుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, తెలంగాణ నుంచి ప్రతి రోజూ వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని, ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉందని కనుక ఏపీ సర్కార్ ఈ విషయంలో స్పందించి తమకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.సీఎం చంద్రబాబును కలిసిన TTD చైర్మన్ బీఆర్ నాయుడు
గత కొంత కాలంగా తిరుమల కొండపై శ్రీవారి దర్శనాల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదని.. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబుతో సమావేశం అయిన బీఆర్ నాయుడు.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చర్చించారు.