వాడియాల భూకబ్జాపై విచారణ చేయండి
• బిస్మిల్లా బీకి న్యాయం చేయండి
• మిడ్జిల్ తహసీల్దార్ కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆదేశం
జడ్చర్ల (మిడ్జిల్), సెప్టెంబర్ 18: మిడ్జిల్ మండలం వాడియాల గ్రామానికి చెందిన బిస్మిల్లా బీ అనే వృద్ధురాలికి సంబంధించిన భూమిని, ఇంటిని ఇతరులు మాయం చేసారని వచ్చిన ఫిర్యాదుపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మిడ్జిల్ తహసీల్దార్ ను ఆదేశించారు. ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే, వాడియాల గ్రామానికి చెందిన బిస్మిల్లా బీ కుటుంబీకులకు సర్వే నెంబర్ 92అ లో 11 ఎకరాల 28 గుంటల భూమి ఉంది. బిస్మిల్లా బీకి ముగ్గురు కూతుర్లు ఉండగా ఆమె హైదరాబాద్ కు వలస పోయి గత 30 సంవత్సరాలుగా నగరంలోని ఇళ్లల్లో పని చేసి పొట్టపోసుకుంటోంది. అయితే ఆమె గ్రామంలో లేని సమయంలో కొంత మంది వ్యక్తులు ఆమె చనిపోయిందని అధికారులను నమ్మించి కొంత భూమిని అన్యాక్రాంతం చేసారు. అలాగే గ్రామంలో ఉన్న ఆమె ఇంటిని కూడా మరికొందరు కబ్జా చేసి మొత్తం మీద వాడియాల లో బిస్మిల్లా బీకి చెందిన భూమిని, ఇంటిని కూడా మాయం చేసారు. రెక్కాడితేగానీ డొక్కాడని తమ కుటుంబం నగరానికి వలసపోయి పొట్టపోసుకుంటుంటే గ్రామంలో తమకు మిగిలిన కొద్దిపాటి ఆస్తిని కూడా కబ్జాదారులు స్వాహా చేసారని, తనకున్న ముగ్గురు కుమార్తెలకు ఉన్న ఆధారం అదొక్కటేనని బిస్మిల్లా బీ మీడియా ప్రతినిధుల ఎదుట రోదించింది. ఈ విషయం మీడియా ద్వారా బుధవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఈ వ్యవహారంపై విచారణ చేసి తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు. కాగా జడ్చర్ల నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని, భూఅక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉంటే ఎంతటి వారిపైనైనా చర్యలకు సిఫార్సు చేస్తానని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు.
---------------------------
ఆస్పత్రిలో లిఫ్ట్ ను తక్షణం రిపేర్ చేయండి
---------------------------
జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలోని లిఫ్ట్ ను తక్షణం మరమ్మత్తులు చేయించాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెఓ)ని కోరారు. జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో రోగులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన లిప్ట్ గత కొద్ది రోజులుగా పని చేయడం లేదనే విషయం ఎమ్మెల్యే దృష్టికి రావడంతో ఈ విషయంగా ఆయన ఆస్పత్రి సూపరింటెండెంట్ ను లిప్ట్ విషయంగా ఆరా తీసారు. ఆస్పత్రిలో రెండు లిఫ్ట్ లు ఉండగా వాటిలో ఒకటి ఇదివరకే చెడిపోగా డయాలసిస్ విభాగంలో ఉన్న మరో లిప్ట్ కూడా బుధవారం మొరాయించింది. అయితే వీటిని మరమ్మత్తులు చేసే వార్షిక కాంట్రాక్టును పొందిన సంస్థకు వీటి విషయంగా తాము ఫిర్యాదు చేసి బాగు చేయాలని కోరినా వారు స్పందించడం లేదని సూపరింటెండెంట్ చెప్పడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని డిఎంహెఓ కు ఫిర్యాదు చేసారు. లిప్ట్ లు లేని కారణంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే చెడిపోయిన లిప్ట్ లను వెంటనే బాగు చేయాలని, అలాగే లిప్ట్ ల నిర్వహణను నిర్లక్ష్యం చేసిన ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.