ఇంటర్‌ అడ్మిషన్ల గడువు పెంపు

 ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థుల అడ్మిషన్ల గడువును ఈనెల 31 వరకు పెంచడంతో విద్యార్థులకు ఊరట కలిగింది.

ఈనెల 31 వరకు అవకాశం

నారాయణపేట, జూలై 3 : ప్రభుత్వం ఇంటర్‌ విద్యార్థుల అడ్మిషన్ల గడువును ఈనెల 31 వరకు పెంచడంతో విద్యార్థులకు ఊరట కలిగింది. ఇది వరకే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించాలని అధ్యాపకులు పదో తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ కళాశాలలోమెరుగైన విద్యను అందిస్తామని సూచిస్తూ గత విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తీర్ణత గ్రేడింగ్‌ల కర పత్రాలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో కోస్గి, మద్దూర్‌, దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, ఊట్కూర్‌, మక్తల్‌, మాగనూర్‌ మొత్తం ఎనిమిది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. పది జీపీఏ ఆధారంగా అడ్మిషన్లు తీసుకునేలా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతీ కళాశాలలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు పది శాతం, బీసీలకు 29 శాతం, దివ్యాంగులకు మూడు శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అర్హత కల్గిన వారికి ఐదు శాతం, ఎక్స్‌ సర్వీస్‌ పిల్లలకు మూడు శాతం, టీడబ్ల్యూఎస్‌ వారికి పది శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించింది. బాలికలకు 33 శాతం రిజర్వేషన్‌, ప్రతీ సెక్షన్‌లో 88 మందికి అనుమతి ఇవ్వాలని పేర్కొంది. ఇప్పటి వరకు జిల్లాలో ఇంటర్మిడియట్‌ ప్రథమ సంవత్సరంలో ఫస్ట్‌ ఇయర్‌లో ప్రభుత్వ కళాశాలల్లో మొత్తం 961 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.



Previous Post Next Post

نموذج الاتصال

Follow Me