హైదరాబాద్, ఆగస్టు 7: తెలంగాణలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. అయితే, పలు చోట్ల ఘర్షణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రసాభాసగా మారింది. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, కాంగ్రెస్ ఇన్‌చార్జి శ్యా్మ్ నాయక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరిగి.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి.. శ్యామ్ నాయక్‌ను వాటర్ బాటిల్‌తో కొట్టింది. ఆయనపైకి వాటర్ బాటిల్ బలంగా విసరడంతో శ్యామ్‌కు దెబ్బ తగిలింది.
ఇక్కడే కాదు.. ఇటీవల ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోతుంది. ఇరు పార్టీల నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం రచ్చ రేపుతోంది. మొన్నటికి మొన్న కాంగ్రెస్ నేతలు, సబితా ఇంద్రారెడ్డి మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అంతకుముందు.. మరికొన్ని చోట్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.