జడ్చర్ల : జడ్చర్ల పట్టణంలోని డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో
అభివృద్ధి చేస్తున్న తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో అరుదైన ఆర్కిడ్ జాతులు పుష్పించాయని కళాశాల ప్రిన్సిపాల్ డా. అప్పియ చిన్నమ్మ తెలిపారు. సాధారణంగా ఆర్కిడ్ జాతులు దట్టమైన అడవుల్లో తేమ ఎక్కువ గల ప్రదేశాల్లో నీడలో పెరుగుతూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 31 జాతులు మాత్రమే ఉన్నాయంటే అవి ఎంత అరుదైనవో అర్థం అవుతుంది. అందమైన పూలనిచ్చే ఈ మొక్కలు అటవీ స్వచ్ఛతను తెలుపుతాయి. అలాంటి అరుదైన ఆర్కిడ్ జాతులను దేశంలోని నలుమూలల నుండి సంగ్రహించి వాటిని తెలంగాణ బొటానికల్ గార్డెన్ లో పెంచుతున్నామని గార్డెన్ సమన్వయకర్త డా. బి.సదాశివయ్య తెలిపారు.' వాటిని సేకరించడమే కాదు పెంచడం కూడా కత్తిమీద సాము లాంటిదేనని వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించినప్పుడే అవి పెరుగుతాయని సదాశివయ్య పేర్కొన్నారు. వాటికోసం గార్డెన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అందువల్ల కాలానుగుణంగా అవి పుష్పిస్తున్నాయని సదాశివయ్య తెలిపారు.
అటువంటి అరుదైన ఆర్కిడ్ జాతికి చెందిన జియోడోరమ్ లాక్సీఫ్లోరమ్ అనే మొక్క గార్డెన్ లో పుష్పించింది. దీనిని 2 సంవత్సరాల క్రితం నల్లమల అడవుల్లో సేకరించి గార్డెన్ లో సంరక్షిస్తున్నామన్నారు. ఈ అరుదైన మొక్కలు గార్డెన్ లో ఉండటం వల్ల కళాశాలలో జీవశాస్త్రం అదే విధంగా పీజీ వృక్షశాస్త్రము చదివే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
I సుమారు 30 సె.మీ. పెరిగే ఈ మొక్క కేవలం 4 నుంచి 8 పుష్పాలను మాత్రమే పుష్పిస్తుందని అవి లోపల ముదురు బంగారు వర్ణంలో వుండి బయట లేత పసుపు రంగులో చాలా ఆకర్షనీయంగా ఉంటాయి. ఈ జాతి భారతదేశానికి చెందిన స్థానీయమొక్క. ఇవి దేశంలో ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో తేమతో కూడిన ఆకురాల్చు అడవుల్లో మాత్రమే పెరుగుతాయి. తెలంగాణ రాష్ట్రంలో గుర్తించటం ఇదే మొదటిసారి అని డా. సదాశివయ్య
వివరించారు.