హైదరాబాద్: 1969 తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసిన, అమరవీరుల స్మారక స్తూప శంకుస్థాపనకు చారిత్రక శ్రీకారం చుట్టిన అప్పటి హైదరాబాద్ నగర మేయర్, కీర్తిశేషులు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ తెలంగాణ ప్రభుత్వం సముచిత గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారులు, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు, అభిమానులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
1969 తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 360 మంది అమరవీరుల స్మారకార్థం గన్‌పార్క్ వద్ద స్మారక స్తూపం నిర్మించాలని అప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌లో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ఘనత నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారిదే. ప్రభుత్వ అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా, 1970 ఫిబ్రవరి 23న అప్పటి తెలంగాణ ప్రజా సమితి (TPS) నాయకుడు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమక్షంలో, పోలీసుల నిఘాను తప్పించుకుని గన్‌పార్క్‌లోకి ప్రవేశించి అమరవీరుల స్మారక స్తూపానికి చారిత్రక శంకుస్థాపన చేశారు.
ఆ సంఘటన అనంతరం ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఒక రాత్రి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ఉంచి, అనంతరం 10 రోజుల పాటు ముషీరాబాద్ జైలులో నిర్బంధించారు. మేయర్ పదవిలో కొనసాగుతూనే ప్రజల ఆకాంక్ష కోసం, తెలంగాణ అమరవీరుల గౌరవం కోసం నిర్బంధాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నిస్వార్థ ఉద్యమకారుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారు.
అంతేకాకుండా, అమరవీరుల స్మారక స్తూప నిర్మాణానికి రూ.25,000 నిధులు మంజూరు చేయించడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. నేడు తెలంగాణ ప్రజలు గర్వంగా సందర్శించే గన్‌పార్క్ అమరవీరుల స్మారక స్తూపం వెనుక ఆయన త్యాగం, పట్టుదల, ఉద్యమస్ఫూర్తి చిరస్మరణీయమైనవి.
ప్రభుత్వానికి విజ్ఞప్తి
తెలంగాణ అమరవీరుల స్ఫూర్తిని చిరస్థాయిగా నిలబెట్టేందుకు విశేష సేవలందించిన కీర్తిశేషులు నెల్లి లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారికి మరణానంతరం 'పద్మశ్రీ' పురస్కారం అందజేయాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేయాలి.
అలాగే, గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం ప్రాంగణానికి "నెల్లి లక్ష్మీనారాయణ పార్క్" అని నామకరణం చేసి, ఆయన చారిత్రక సేవలకు శాశ్వత గుర్తింపు కల్పించాలని కోరుతున్నాము.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులకు తగిన గౌరవం దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము.