Gadwal News గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

గద్వాల ఫుట్‌పాత్ ఆక్రమణలు

గద్వాల జిల్లా కేంద్రంలో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ప్రస్తుతం వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. ప్రజలు నడవడానికి కూడా వీలు లేకుండా మారిపోయింది. అడ్డుకోవాల్సిన అధికారులు పర్యవేక్షణ చేపట్టి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వాణిజ్య దుకాణాలను తొలగించాల్సింది పోయి పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. పట్టణంలోని ప్రధాన రోడ్లను ఆక్రమించి యథేచ్ఛగా తాత్కాలిక దుకాణాలు వెలుస్తున్నాయి.

దర్జాగా కబ్జా

గద్వాల, శాంతినగర్, అయిజ మున్సిపాలిటీలకు గ్రామాల నుంచి ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. దీంతో ప్రధాన రహదారులపై ఎప్పుడూ రద్దీ కొనసాగుతుంటుంది. కొన్ని చోట్ల సెట్‌బ్యాక్ లేకుండానే షాపింగ్ మాల్స్ నిర్మించారు. ఫలితంగా వాహనాల రాకపోకలతో పాటు పాదచారుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది.

పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై ప్రస్తుతం చిరు వ్యాపారులు తిష్టవేశారు. బట్టల దుకాణాలు, పండ్ల దుకాణాలు, సెల్‌ఫోన్ షాపులు, తినుబండారాల స్టాళ్లు వంటి అనేక చిన్న వ్యాపారాలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించాయి. దీంతో ప్రధాన రహదారులపై నడవడానికి కూడా ప్రజలకు స్థలం లేకుండా పోతోంది. వినియోగదారులు తమ వాహనాలను రోడ్డుపైనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరుగుతోంది.

పెరుగుతున్న రోడ్డు ఆక్రమణలు

పట్టణాల్లో రోజురోజుకు రోడ్డు ఆక్రమణలు పెరుగుతున్నాయి. మురుగు ప్రవాహం కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజీపై కూడా ఆక్రమణలు జరుగుతున్నాయి. కృష్ణవేణి చౌరస్తా సమీపంలో డ్రైనేజీపై పండ్ల దుకాణాలు, చికెన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా అధికారుల కార్యాలయం సమీపంలో బైక్ మెకానిక్ షాపులు, వెల్డింగ్ సెంటర్లు కూడా వెలిశాయి.

గద్వాల తహసీల్దార్ కార్యాలయం పక్కన ప్రధాన రహదారిపై కొత్తగా నెట్ సెంటర్లు వెలుస్తున్నాయి. దీంతో భారీ కిరాయిలు చెల్లిస్తూ షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అరాచకం అంటే ఇదేనా? బన్నీ-అట్లీ మూవీ టైటిల్ లీక్.. ఇన్ని వేషాలు ఎలా గురూ !

రోడ్లపైనే బండ్లను ఆపి..

ప్రభుత్వ ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు కొందరు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం ప్రధాన రహదారిపై రోడ్డునే ఆక్రమించి పళ్ళ దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో కొనుగోలు దారులు రోడ్డుపైనే వాహనాలు ఆపి కొనుగోలు చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పాత దుకాణ సముదాయాలు, ఎల్లప్ప హాస్పిటల్ సమీపంలో రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఒక కారు వెళ్తే మరో కారు వెళ్లే పరిస్థితి లేదు. రాయల్ లాడ్జ్ సమీపంలో కిరాణా దుకాణాలకు భారీ వాహనాలు తరచుగా సరుకులు దిగజేస్తుండడంతో పాటు కూరగాయల దుకాణాలు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎప్పుడూ రద్దీ నెలకొంటోంది.

చర్యలు తీసుకోవడం శూన్యం

జిల్లా కేంద్రంగా మారిన తరువాత పెరిగిన ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకొని అక్రమ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అవకాశంగా భావించిన ఆక్రమణదారులు భారీగా తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్నారు.

కొంతమంది ఆక్రమించిన స్థలాలను మరొకరికి కిరాయికి ఇచ్చి డబ్బులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహనాల సంఖ్య పెరుగుతూ రోడ్లు కుంచించుకుపోతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow