పనిచేయని ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు
ఎమర్జెన్సీ ఎగ్జిట్లు బంద్.. ఉన్నచోట్ల గేట్లకు తాళాలు
రాష్ట్రవ్యాప్తంగా 800 హాస్పిటల్స్‌లో ఫైర్ సిబ్బంది తనిఖీలు
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, స్కూళ్లలో ఫైర్ సేఫ్టీ డొల్లతనం బయటపడింది. అగ్ని ప్రమాదాలు జరిగితే గుర్తించే వ్యవస్థతోపాటు ప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలు కూడా అందుబాటులో లేవు. ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేవని, సిబ్బంది సైతం అందుబాటులో లేరని ఫైర్ డిపార్ట్‌మెంట్ తనిఖీల్లో వెలుగుచూసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా పేషెంట్లు, విద్యార్థుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటం ఆడుతున్నట్టు అగ్నిమాపక అధికారులు గుర్తించారు.
ఈ మేరకు భద్రతా ప్రమాణాలు పాటించని 230 హాస్పిటళ్ల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 32 కార్పొరేట్ స్కూల్స్‌లోనూ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదని తేలింది. దీంతో గడువులోగా ఫైర్ సేఫ్టీ చర్యలు చేపట్టాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు సంబంధిత యాజమాన్యాలను హెచ్చరించారు. ఈ క్రమంలోనే గ్యాస్ గోదాములు, కమర్షియల్ కాంప్లెక్సుల్లో సోమవారం నుంచి తనిఖీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో తనిఖీలు
"ప్రజాపాలన –- ప్రగతి ప్రణాళిక" పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫైర్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 145 ఫైర్ స్టేషన్‌లో ప్రతి రోజూ తనిఖీలు చేపడ్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతలో ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్, స్కూళ్లలో తనిఖీలు చేయడంతో పాటు అగ్నిప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రాజకీయ వ్యంగ్య కార్టూన్లు
ఈ క్రమంలో రాష్ట్రంలోని దాదాపు 800 ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో తనిఖీలు చేశారు. అత్యధికంగా ప్రైవేట్హాస్పిటల్స్లో ఫైర్ అలారమ్స్, స్మోక్ డిటెక్టర్లు, ఆటోమేటిక్ స్ప్రింక్లర్లు, హౌస్ రీల్స్, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు లేవు. ఉన్నచోట్ల సరిగ్గా పనిచేయట్లేదు. చాలా హాస్పిటల్స్, స్కూళ్లలో ఎగ్జిట్ డోర్లు లేవు. ఉన్నచోట్ల పనిచేయడం లేదు. లేదంటే తాళాలు వేసి ఉంచడం అధికారులను విస్మయపరిచింది. మొత్తం మీద ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని 230 హాస్పిటల్స్‌కు, 32 స్కూళ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐసీయూల వద్దా నో ఫైర్ సేఫ్టీ..
ఇంటెన్సివ్ కేర్ (ఐసీయూ), క్రిటికల్ కేర్ యూనిట్‌లు, ఆపరేషన్ థియేటర్ల వద్ద సరైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేవని అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. అంతే కాదు, అగ్ని ప్రమాదాలు జరిగితే పేషెంట్లను ఎలా రెస్క్యూ చేయాలో సిబ్బందికి ఏమాత్రం అవగాహన లేదని తెలుసుకున్నారు. ఈ విషయంలో వారికి యాజమాన్యం ఎలాంటి అవగాహన కల్పించలేదని బయటపడింది. ఇక ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన గ్యాస్ నిల్వ యూనిట్లు, ఆక్సిజన్ సిలిండర్లను ఇరుకైన బేస్‌మెంట్లలో నిల్వ చేసినట్టు వెలుగు చూసింది. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఓవర్‌లోడ్, ప్రమాదాల సమయంలో పేషెంట్లను తరలించేందుకు అవసరమైన సిబ్బంది కూడా ఎక్కడా అందుబాటులో లేకపోడం గమనార్హం. వీటితో పాటు ఫైర్ సర్వీసెస్ సహా వివిధ శాఖలకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేని విషయం వెలుగుచూసింది.
Tags
Hyderabad