సీఎంలతో సమావేశమైన మోదీ.. ఇంధన సంక్షోభం, రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్ష pm modi zoom meeting with all cms in india

పశ్చిమాసియాలో ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల కారణంగా అంతర్జాతీయ సంక్షోభం తలెత్తడంతో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత భయాల నేపథ్యంలో అంతర్జాతీయ సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితులపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో ఇంధన సంక్షోభంపై చర్చించారు. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, ఎరువుల సరఫరాకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్రాల సన్నద్ధతను సమీక్షించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించిన రాష్ట్రాల ముఖ్యమంత్రులు మినహా తక్కిన రాష్ట్రాల సీఎంలు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

దేశ ఇంధన అవసరాలను తీర్చేందుకు, సరఫరా స్థిరంగా ఉండేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. అయితే క్షేత్రస్థాయిలో అమలు కోసం రాష్ట్రాల సహకారం అవసరమని కేంద్రం పేర్కొంది.

పశ్చిమాసియాలో పరిస్థితుల ప్రభావం ప్రపంచ దేశాలపై పడిందని, భారత్‌పైనా ప్రభావం ఉందని ప్రధాని మోదీ పార్లమెంట్‌లో పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారిని సమష్టిగా ఎదుర్కొన్నట్లే తాజా పరిస్థితులను కూడా కేంద్రం, రాష్ట్రాలు కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

హాజరైన సీఎంలు

ప్రధానమంత్రి నిర్వహించిన వర్చువల్ మీట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow