కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఎటు చూసినా కల్తీయే.. ఉస్మానియా బిస్కెట్లలో కూడా కల్తీ!
కల్తీ.. కల్తీ.. కల్తీ.. ఎటు చూసినా కల్తీయే. ఏం తిందామన్నా కల్తీయే. ఇటీవల రెస్టారెంట్లలో ఫుడ్ కల్తీ ఘటనలు భయాందోళనలు కలిగించాయి. ఆ తర్వాత సబ్బులు, డిటర్జెంట్లు, మస్కిటో రిపెలెంట్లు కూడా కల్తీ అని బయటపడింది. ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు కూడా కల్తీమయం అవుతున్నట్టు అధికారుల దాడుల్లో తేలింది. తాజాగా ఉస్మానియా బిస్కెట్ల వంతు వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించేలా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీపై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బయటపడిన విషయాలు మరింత కలవరపెడుతున్నాయి.
బిస్కెట్లు చూడగానే ఆకర్షణీయంగా కనిపించేందుకు సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఆహార రంగులకు బదులుగా వివిధ కెమికల్స్ కలిపి కొత్త రంగులు సృష్టిస్తున్నట్లు దాడుల్లో తేలింది. ఈ రసాయనాలు శరీరంలోకి వెళ్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కుళ్లిన గుడ్లు.. అపరిశుభ్ర వాతావరణం
అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే బిస్కెట్ల తయారీలో వాడే ముడి సరుకులో నాణ్యత మచ్చుకైనా లేదు. తక్కువ ధరకు వస్తున్నాయని కుళ్ళిపోయిన గుడ్లను యథేచ్ఛగా వాడుతున్నట్లు అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు.
ఫ్యాక్టరీలో కనీస పరిశుభ్రత లేకుండా, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారని అధికారులు తెలిపారు. మనం ఇష్టంగా తినే బిస్కెట్లు ఇలాంటి పరిస్థితుల్లో తయారవుతున్నాయా అని అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
యాజమాన్యంపై ఉచ్చు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఫ్యాక్టరీపై పోలీసులు కేసు నమోదు చేసి ఫ్యాక్టరీని సీజ్ చేశారు. యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ విభాగం నగరం నలుమూలలా ఉన్న ఇతర ఆహార తయారీ కేంద్రాలపై కూడా నిఘా పెంచింది. బయట దొరికే ఆహార పదార్థాల విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.