మానవపాడులో అగ్నిప్రమాదం.. ఆరు ఎకరాల్లో పత్తి పంట దగ్ధం


అలంపూర్: మానవపాడు మండల పరిధిలో శనివారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఓ కౌలు రైతును నిట్టనిలువునా ముంచేసింది. అకస్మాత్తుగా అంటుకున్న మంటల వల్ల దాదాపు ఆరు ఎకరాల పత్తి పంట పూర్తిగా బూడిదైంది. స్థానిక రైతు ప్రసీన్ రెడ్డికి చెందిన 14 ఎకరాల పొలాన్ని, బింగిదొడ్డి గ్రామానికి చెందిన సునీల్ రెడ్డి కౌలుకు తీసుకున్నారు. కౌలు భూమిలో సునీల్ రెడ్డి పత్తి సాగు చేశాడు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉంది. ఎకరాకు సుమారు 3 క్వింటాళ్ల దిగుబడి ఉన్న తరుణంలో ప్రమాదవశాత్తు పొలంలో మంటలు చెలరేగాయి. గాలి వేగానికి మంటలు వేగంగా వ్యాపించడంతో, సుమారు 6 ఎకరాల్లోని పత్తి పంట పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన తోటి రైతులు వెంటనే స్పందించారు. ట్రాక్టర్లతో పొలాన్ని చుట్టూ దున్నడం ద్వారా మంటలు మిగతా ఎనిమిది ఎకరాలకు వ్యాపించకుండా అదుపులోకి తెచ్చారు. పంట చేతికొచ్చే సమయంలో జరిగిన ఈ భారీ నష్టంపై బాధితుడు కౌలు రైతు కన్నీటి పర్యంతమవుతున్నారు. లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట అగ్నిపాలవ్వడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow