రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందాల్సిన రైతు భరోసా ప్రయోజనాలు బ్యాంకింగ్ నిబంధనల కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలోనే చిక్కుకుపోతున్నాయి.
నవాబుపేట : రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందాల్సిన రైతు భరోసా ప్రయోజనాలు బ్యాంకింగ్ నిబంధనల కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థలోనే చిక్కుకుపోతున్నాయి. మొండి బకాయిలు (నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్) పేరుతో బ్యాంకర్లు రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెట్టడం, డబ్బులు జమ అయిన వెంటనే ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ చూపించడం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పలు చోట్ల రైతులు తమ ఖాతాల్లో ఉన్న అమౌంట్ కనిపించకుండా జీరో బ్యాలెన్స్ చూపుతుండడంతో పాటు ఖాతాల్లోకి ఇతరులు జమా చేసిన అమౌంట్, రైతుబంధు నిధులు కనిపించకపోవడంతో హడలెత్తిపోయారు. అకౌంట్లు హ్యాక్ అయ్యాయా? సైబర్ నేరగాళ్ల బారిన పడ్డామా? అన్న భయంతో బ్యాంకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే విచారణలో, బ్యాంకులు తమకు ఉన్న పాత బకాయిలను వసూలు చేసుకునే క్రమంలో ఈ మొత్తాలను సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. రుణగ్రహీతలు చెల్లించాల్సిన రుణాలు 90 రోజులకుపైగా పెండింగ్‌లో ఉంటే వాటిని ఎన్‌పీఏలుగా గుర్తిస్తారు. అలాంటి ఖాతాల్లోకి డబ్బులు జమైతే, బ్యాంకులకు ఉన్న హక్కుల మేరకు ఆ మొత్తాన్ని బకాయిలకు సర్దుబాటు చేయవచ్చు. అయితే రైతుభరోసా వంటి ప్రభుత్వ పథకాల నిధులను కూడా ఈ విధంగా బ్యాంకర్లు తమను వాడుకోకుండా చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బులే కాకుండా ఇతరత్రా తమ ఖాతాలలో జమైన డబ్బులను కూడా వాడుకోకుండా ఖాతాలను హోల్డ్ లో పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమ పంటల సాగు ఖర్చుల కోసం ఇస్తున్న డబ్బును బ్యాంకులు ఈ విధంగా తీసుకుంటే తాము ఎలా వ్యవసాయం చేయాలి?” అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, బ్యాంకర్లు మాత్రం ఇది పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతోందని, బకాయిలు ఉన్న ఖాతాల్లోకి వచ్చే నిధులను సర్దుబాటు చేయడం తమ బ్యాంకు నియమ నిబంధనలలో భాగమని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు రెండు వైపులా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పాత రుణాల ఒత్తిడి, మరోవైపు కొత్త సాగు కోసం అవసరమైన నిధులు అందకపోవడం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. రైతుబంధు నిధులను ఇతర బకాయిలకు మళ్లించడంపై ప్రభుత్వం, బ్యాంకింగ్ అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు తమ ఖాతాలపై ఎలాంటి హోల్డ్ లేదా డిడక్షన్ జరిగినా వెంటనే తమను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని, అవసరమైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని, రైతులు పూర్తి అవగాహనతో బ్యాంకులతో ముందుకు సాగాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు.
Tags
Telagana