అమ్మపై కోపముంటే.. అంతమొందిస్తావా నాన్నా?


 

కుమార్తెకు ఎలుకలమందు తినిపించి చంపిన తండ్రి తానూ ఆత్మహత్యాయత్నం
యాదాద్రి భువనగిరి జిల్లా లచ్చమ్మగూడెంలో దారుణం

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: ముద్దులొలికే చిన్నారి.. కన్నతండ్రి ప్రేమగా పండు చేతికందిస్తే.. ఎప్పట్లాగే మురిపెంగా తినేసింది. కానీ ఆ చిట్టితల్లికేం తెలుసు? అమ్మపై కోపంతో నాన్న ఆ పండులో విషం కలిపాడని! యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లచ్చమ్మగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల రవికి మూడేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలానికి చెందిన స్వాతితో వివాహమైంది. వీరికి మేఘన (2 ఏళ్లు), మయూరి (9 నెలలు) సంతానం. గొడవలతో మూడు నెలల క్రితం స్వాతి చిన్న కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. మేఘన తండ్రి వద్దే ఉంటోంది. పెద్ద కుమార్తెనూ తన వద్దకు పంపించాలని స్వాతి పెద్దల సహాయంతో కోరింది. రవి వినకపోవడంతో మాడ్గుల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి పోలీసులు సంస్థాన్‌ నారాయణపురం ఠాణాకు సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో పెద్ద మనుషుల సమక్షంలో సోమవారం మాట్లాడుకోవాలని ఇరువురూ ఓ నిర్ణయానికి వచ్చారు. పరువు పోయిందనే కోపమో.. కుమార్తె దూరం అవుతుందనే బాధనో ఈలోపే మేఘనను కడతేర్చాలనే నిర్ణయానికి వచ్చాడు రవి. శనివారం సపోటా పండులో ఎలుకల మందు కలిపి ఇచ్చాడు. నాన్న పండు తెచ్చాడని సంతోషంతో తిన్న ఆ చిన్నారి వాంతులు చేసుకుంటూ అపస్మారకస్థితిలోకి వెళ్లింది. రవి కూడా నిద్ర మాత్రలతోపాటు ఎలుకలమందు నీళ్లలో కలుపుకొని తాగాడు. కొద్దిసేపటి తర్వాత కుటుంబసభ్యులు గమనించిఅడగగా.. విషయం చెప్పాడు. వెంటనే రవిని నల్గొండ ఆసుపత్రికి, మేఘనను హైదరాబాద్‌ నిలోఫర్‌ హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి సోమవారం మృతి చెందింది. అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామం లచ్చమ్మగూడెంలో జరిగాయి. స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow