సూపర్డెంట్ తో పాటు మరో ముగ్గురు అధికారులను సస్పెండ్

ఇదేనా ప్రజా పాలన.. శవానికే రక్షణ లేదు..! కుక్కలు శవాన్ని తిన్న ఘటనలు నలుగురు అధికారులు సస్పెండ్.. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాజీనామాకు లక్ష్మారెడ్డి డిమాండ్


జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో చోటుచేసుకున్న శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై రాజకీయంగా తీవ్ర ప్రతిస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖానాలో సోమవారం మార్చురీలో ఉన్న శవాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనను ఆయన అత్యంత దారుణమని అభివర్ణించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. మంగళవారం ఆసుపత్రిని సందర్శించిన అనంతరం 100 పడకల ప్రభుత్వ ప్రాంతీయ దవాఖానాకు వెళ్లి మీడియాతో మాట్లాడారు.

ప్రాంతీయ దవాఖానాలో మార్చురీ గది నిర్మాణం పూర్తై ఏడాదిన్నర గడిచినా ప్రారంభించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని పేర్కొన్నారు. మార్చురీ ప్రారంభించి ఉండి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని అన్నారు. “పాత రోజులు తీసుకొస్తాం” అన్న కాంగ్రెస్ పార్టీ హామీని ఈ ఘటన నిజం చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ, చేతలు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

వంద రోజుల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమిస్తామని చెప్పినా ఇప్పటికీ నియామకాలు జరగలేదని మండిపడ్డారు. ఇంతటి దారుణ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ దవాఖానాను పూర్తిస్థాయిలో బలోపేతం చేసి వైద్యులు, సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న దామోదర రాజనర్సింహతో పాటు స్థానిక ప్రజాప్రతినిధి అనిరుద్ రెడ్డి రాజీనామా చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయ నాయకులు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.

ఈ ఘటనలో 90 శాతం బాధ్యత ప్రభుత్వానిదేనని, అధికారులపై మాత్రమే చర్యలు తీసుకోవడం ద్వారా వారిని బలిపశువులుగా చేయడం సబబు కాదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యమే ఈ ఘటనకు మూలకారణమని అన్నారు.

ఆయన వెంట బీఆర్ఎస్‌కు చెందిన కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow