మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత కాలిపోయిన బస్సును పోలీసులు తనిఖీ చేయగా ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ ఒకటి బయటపడింది.
అయితే ఆ సిలిండర్ పేలిందా లేదా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని పోలీసులు తెలిపారు. సిలిండర్ ఆకారం చూస్తుంటే బస్సులో రేగిన మంటల్లో కాలిపోయి నల్లగా మారినట్టే కనిపిస్తోందని, పేలినట్లు మాత్రం కనిపించడం లేదని అధికారులు చెప్పారు.
మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద పలకల క్వారీ దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు టిప్పర్‌ను ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 13 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనం కావడం తీవ్ర విషాదం నింపింది. మరో 26 మంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గురువారం ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో వెనుక ఉన్న ప్రయాణికులు బయటకు రావడానికి వీలుకాలేదు.
ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.