- గద్వాల జిల్లా బీచుపల్లిలో రూ. 47 కోట్లతో ఆయిల్ మిల్లు!
- వేగంగా కొనసాగుతున్న సివిల్ పనులు
- భారీ సబ్సిడీలు, బై-బ్యాక్ గ్యారంటీతో రైతులకు ప్రోత్సహం
- జిల్లాలో 7,200 ఎకరాలకు విస్తరించిన సాగు
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయిల్ పామ్ రైతులకు మంచిరోజులు రానున్నాయి. జిల్లాలోని ఎర్రవల్లి మండలం బీచుపల్లి సమీపంలో ఆయిల్ పామ్ రైతుల కోసం కొత్త ఆయిల్ మిల్లు ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. సుమారు రూ.47 కోట్ల అంచనాతో ఈ మిల్లు నిర్మించేందుకు ఆయిల్ ఫెడ్ సంస్థ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందింది.
నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న పాత విజయ ఆయిల్ మిల్ ప్రాంగణంలో ప్రస్తుతం సివిల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నిర్మాణం పూర్తయిన వెంటనే టెక్నికల్, మిషన్ ఫిట్టింగ్ పనులు ప్రారంభించి, మిల్లును త్వరలోనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ఫోకస్
జిల్లాలో ఆయిల్ పామ్ తోటల పెంపకంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ‘మన ఊరు - మన ఆయిల్ పామ్ - మన భవిష్యత్’ అనే నినాదంతో ఉద్యానవన, వ్యవసాయ శాఖలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,751 మంది రైతులు సుమారు 7,200 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఈ కొత్త మిల్లు అందుబాటులోకి వస్తే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని, దళారుల బెడద లేకుండా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
భారీగా సబ్సిడీలు..
రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలను అందిస్తోంది. రూ. 193 విలువైన ఒక్కో మొక్కను కేవలం రూ.20కే అందిస్తూ, మిగిలిన రూ. 173ను సబ్సిడీగా భరిస్తోంది. వీటితో పాటు ఎకరాకు నాలుగేండ్ల పాటు రూ. 2,100 మెయింటెనెన్స్, అంతర్ పంట సాగు చేస్తే మరో రూ. 2,100 అదనంగా ఇస్తున్నారు. 12 ఎకరాల వరకు డ్రిప్ సౌకర్యానికి కూడా సబ్సిడీ వర్తిస్తుంది. పండించిన పంటను ఆయిల్ కంపెనీలే కొనుగోలు చేసేలా ‘బై బ్యాక్’ ఒప్పందాలు చేసుకోవడం రైతులకు కొండంత అండగా నిలుస్తోంది.
టన్నుకు రూ. 20,450
ప్రస్తుతం ఒక టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ. 20,450 వరకు పలుకుతుండగా, భవిష్యత్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. నాలుగేండ్ల తోటల నుంచి ఎకరాకు సగటున 4 నుంచి 5 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. రవాణా ఖర్చులు తగ్గించేందుకు శాంతినగర్ సమీపంలోని వెంకటపురం స్టేజీ, ధరూర్ మండలాల్లో కూడా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బీచుపల్లి మిల్లు అందుబాటులోకి వస్తే గద్వాల జిల్లా ఆయిల్ పామ్ సాగులో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది.
సివిల్ పనులు జరుగుతున్నాయి..
ప్రస్తుతం బీచుపల్లి దగ్గర ఆయిల్ మిల్ కు సంబంధించి సివిల్ పనులు జరుగుతున్నాయి. ఆయిల్ మిల్లును రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు కలగవద్దనే ప్రస్తుతం పండిన పంటను కూడా కొనుగోలు చేస్తున్నాం. మిల్లు ఏర్పాటు అయితే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
-సుధాకర్ రెడ్డి, టీజీ ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్
Tags
mahabubnagar