న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 రౌండ్ రసవత్తరంగా సాగుతోంది. సూపర్ 8లో రెండు విజయాలతో గ్రూప్ 1 నుంచి ఇప్పటికే సౌతాఫ్రికా సెమీస్ బెర్తు కన్ఫామ్ చేసుకుంది. మిగిలిన స్థానం కోసం అతిథ్య ఇండియా, వెస్టిండీస్ పోటీ పడుతున్నాయి. 2026, మార్చి 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు రన్ రేట్‌తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.
మ్యాచ్ రద్దైతే ఇండియా ఇంటికే..!
ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే మాత్రం టీమిండియా ఇంటి దారి పడుతోంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. కాబట్టి వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇండియా, వెస్టిండీస్‌కు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు వెస్టిండీస్, ఇండియాకు చెరో మాడు పాయింట్లు ఉంటాయి. కానీ మెరుగైన నెట్ రన్‌తో కరీబియన్లు సెమీస్‌కు వెళ్తారు. సూపర్ 8 రౌండ్లో ఇండియా కంటే వెస్టిండీస్ రన్ రేటే మెరుగ్గా ఉంది.
సూపర్ 8 పోరులో భాగంగా జింబాబ్వేపై వెస్టిండీస్ 101 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ జట్టు రన్ రేట్ అమాంతం ప్లస్ 3కి చేరింది. ఇదే సమయంలో సౌతాఫ్రికా చేతిలో ఇండియా 76 రన్స్ తేడాతో ఘోర ఓటమిని చవి చూసింది. ఈ పరాజయంతో ఇండియా నెట్ రన్ రేట్ మైనస్‌లోకి వెళ్లింది.
ఇదిలా ఉండగానే వెస్టిండీస్‌ను సౌతాఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తు చేయగా.. జింబాబ్వేపై భారత్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం కరేబియన్ జట్టు నెట్ రన్ రేట్1.791 ఉండగా.. ఇండియా నెట్ రన్-రేట్ -0.1 గా ఉంది. ఇండియా కంటే రన్ రేట్ మెరుగ్గా ఉండటంతో ఆదివారం (మార్చి 1) జరిగే మ్యాచ్ ఒక వేళ వర్షం కారణంగా రద్దైతే మాత్రం వెస్టిండీస్ నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. అతిథ్య ఇండియా టైటిల్ వేట ముగుస్తుంది.
ఆదివారం కోల్‌కతా వాతావరణం ఎలా ఉంటుందంటే..?
ఆదివారం (మార్చి 1) కోల్‌కతాలో వర్షం పడే అవకాశం లేదని వెదర్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. మ్యాచ్ డే రోజు ఎండ, పొడి వాతావరణం ఉంటుందని అంచనా. పగటిపూట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉండనుండగా.. సాయంత్రం మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి ఇది 25-26 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతుందని వెల్లడించాయి. ఇండియాకు డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఆ రోజు వర్షం పడొద్దని భారత క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.