హైదరాబాద్: రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో తాము పనిచేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి సీఎం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.
‘‘నిజాం పాలకులకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి పోరాటం చేశారు. నాడు ప్రజల కష్టాలు, రాచరిక పోకడలు, అరాచక చర్యలపై పోరాడారు. 500 ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. స్వేచ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు వస్తుంది. ప్రజల తిరుగుబాటు సాయుధ పోరాటంగా మారుతుందని ఆయన చాటి చెప్పారు. 60 ఏళ్లు వచ్చేసరికి రాజకీయ పదవీ విరమణ చేసిన గొప్ప నాయకుడు రావి నారాయణరెడ్డి. ప్రజల నుంచి తిరస్కారం పొందినా.. నేటి నేతలకు పదవీ వ్యామోహం పోవడం లేదు. తెలంగాణలో పదవులన్నీ కేసీఆర్ కుటుంబం అనుభవించింది. వందల ఎకరాల ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల వ్యాపారాలు మీకెలా వచ్చాయి..? బీఆర్‌ఎస్ నేతలు చేయాల్సిన తప్పులన్నీ చేశారు. నేరాలు చేస్తాం.. పశ్నించవద్దని మీరెలా అంటారు? అక్రమ మార్గాలు ఎంచుకున్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా విచారణ తప్పదు’’ అని సీఎం స్పష్టం చేశారు.
రావి నారాయణ రెడ్డి నేషనల్ అవార్డు పొందడం ఎంతో గొప్పదిగా భావిస్తానని అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి అన్నారు. రావి నారాయణ రెడ్డి నిత్య చైతన్య స్ఫూర్తి అని కొనియాడారు. సొంత ఆస్తులను ప్రజలకు పంచిన మహానుభావుడని ప్రశంసించారు.