Rajasthan Murder: ‘హనీమూన్‌ హత్య’ తరహా ఘటన.. భర్తను వాకింగ్‌కు తీసుకెళ్లి..!


 పెళ్లయిన మూడు నెలలకే భర్తను హత్య చేయించిందో యువతి. వాకింగ్‌కు వెళ్దామని తీసుకెళ్లి.. ప్రియుడితో కొట్టి చంపించింది. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. మేఘాలయ ‘హనీమూన్‌ హత్య (Honeymoon Murder)’ను గుర్తుచేస్తున్న ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో (Rajasthan Murder) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన ఆశిష్‌కు మూడు నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన అంజూతో వివాహమైంది. అయితే, కొన్ని రోజులకే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో అంజూ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారమవడంతో మళ్లీ అత్తింటికి చేరుకుంది. జనవరి 30న రాత్రి 9 గంటల సమయంలో వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటుగా వెళ్తున్న కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆశిష్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

గుర్తుతెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లినట్లు అంజూ విచారణలో పేర్కొంది. అయితే, ఆమె చెప్పిన సమాధానానికి, ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అంతేగాక, అంజూకు ఎలాంటి గాయాలు కాకపోవడం, ఆశిష్‌ ఒంటిపై గాయాలు ఉండటంతో పోలీసులు ఆమెను   గట్టిగా విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ప్లాన్‌ చేసి.. బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచి

అంజూ పెళ్లికి ముందు తన ఇంటి సమీపంలో నివసించే సంజూని ప్రేమించినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. వివాహం తర్వాత కూడా అతడితో ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు తెలిపారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో బాయ్‌ఫ్రెండ్‌ను కలిసిన ఆమె.. భర్త హత్యకు కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. ఘటన జరిగిన రాత్రి ఆశిష్‌ను తీసుకుని అంజూ నిర్మానుష్య రహదారిపై వాకింగ్‌కు వెళ్లిందని.. అప్పటికే అక్కడ సంజూ తన స్నేహితులతో కలిసి మాటు వేసినట్లు తెలిపారు. వారంతా ఆశిష్‌పై దాడి చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అంజూ ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow