ఇంటర్నెట్ డెస్క్: మేఘాలయ(Meghalaya) రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాలు(Coal mining) మరోసారి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ గనిలో బొగ్గు తవ్వుతుండగా భారీ పేలుడు(Explosion) సంభవించింది. ఈ పేలుడు ధాటికి 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెస్య్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే పేలుడికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.మేఘాలయలో ర్యాట్ హోల్(Rat Hole mining) మైనింగ్, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే, ఈ తవ్వకాలను 2014 నుంచి జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT) నిషేధించింది. ర్యాట్ హోల్ అంటే.. సమాంతరంగా సన్నని గుంత తవ్వుతూ బొగ్గును బయటకు వెలికి తీసే పద్ధతి. సుమారు 3, 4 అడుగుల వెడల్పుతో ఈ గుంతలు ఉంటాయి. అచ్చం ఎలుకలు బొరియలు తవ్వినట్టుగా ఉంటాయి కాబట్టి దీనికి ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అనే పేరు వచ్చింది. ఇటీవల ఈ తవ్వకాలపై ఎన్జీటీ నిషేధాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.
Tags
india