Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం


Free Bus: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఆపరేషన్స్ పై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను బస్సులో ఫ్రీగా ప్రయాణించేందుకు అనుమతివ్వాలని ఆదేశించారు. 

బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదోతరగతి పరీక్షలు ఉండడంతో పరీక్షల జరిగే ఉదయం, మధ్యాహ్నం సమయంలో అదనంగా బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు బస్సులు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్సుల స్టాప్ ఉన్నా లేకున్నా హాల్ టికెట్ ఆధారంగా పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులను దింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి డిపో మేనేజర్ ద్వారా ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు వినియోగించుకుని ఎలాంటి మానసిక ఆందోళన చెందకుండా పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ ఈడీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow