CM Revanth Reddy: నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ గడ్డపై నుంచి ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు. నిజామాబాద్ జిల్లా చరిత్రను, ఇక్కడి రైతాంగ పోరాట పటిమను కొనియాడుతూనే, గత పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఆయన ఎండగట్టారు. నిజామాబాద్ జిల్లాకు ఉన్న గొప్ప చరిత్రను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. “నా తెలంగాణ కోటి రతనాల వీణ” అని నినదించిన దాశరథి పుట్టిన గడ్డ ఇదని, 1969 తెలంగాణ ఉద్యమం కోసం తన బంగారాన్ని దానం చేసిన సదా లక్ష్మి వంటి వీరవనితల జన్మస్థలమని కొనియాడారు. జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన డి. శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, సుదర్శన్ రెడ్డి వంటి నిష్కళంక నాయకత్వాన్ని ఈ జిల్లా అందించిందని పేర్కొన్నారు.
గత 12 ఏళ్లుగా కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మురికికూపంగా మారిందని సీఎం ఆరోపించారు. “బీజేపీ, టీఆర్ఎస్ ఇక్కడ రెండుసార్లు గెలిచినా సమస్యలు జటిలమయ్యాయే తప్ప పరిష్కారం కాలేదు” అని మండిపడ్డారు. పసుపు రైతులకు ఒకప్పుడు క్వింటాల్ అమ్ముకుంటే తులం బంగారం వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్‌ను రేవంత్ రెడ్డి నేరుగా ప్రశ్నించారు. “ఏడేళ్లుగా ఎంపీగా ఉండి నిజామాబాద్‌కు ఒక్క స్మార్ట్ సిటీని కూడా ఎందుకు సాధించలేకపోయారు?” అని నిలదీశారు. మోదీ దగ్గర పరిపతి ఉంటే ఎయిర్‌పోర్ట్ ఎందుకు తీసుకురాలేదని, గల్లీలో కౌన్సిలర్ కావాలంటే ఢిల్లీకి వెళ్లి మోడీని అడగాలా అని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని సీఎం ఆరోపించారు. కిషన్ రెడ్డి “కల్వకుంట్ల కిషన్ రావు”గా మారి కేసీఆర్‌కు దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ మరియు ఫార్ములా ఈ కేసుల ఫైళ్లు మోదీ ఆఫీసులో ఎందుకు మూలుగుతున్నాయని ప్రశ్నించారు.
బీజేపీ నాయకులు తనను ‘రేవంతుద్దీన్’ అని పిలవడాన్ని ఆయన సానుకూలంగా స్పందించారు. బీసీ కులగణన చేసినందుకు “రేవంత్ గౌడ్” అని, వర్గీకరణ చేసినందుకు “రేవంత్ మాదిగ” అని, ముదిరాజులు, యాదవులు, సిక్కులు అందరూ తనను తమవాడిగా గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం తాను రేవంత్ రెడ్డిగా నిలబడతానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 70 వేల ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని తాము స్వల్ప కాలంలోనే చేసి చూపించామని పేర్కొన్నారు. తాము ఇచ్చిన ఉద్యోగాల సంఖ్యపై ఎవరికైనా అనుమానం ఉంటే చర్చకు సిద్ధమని ప్రకటించారు. “మేము ఇచ్చిన 70 వేల ఉద్యోగాలలో ఒక్కటి తక్కువైనా సరే.. నా తల తీసుకుంటా” అంటూ ఆయన సవాల్ విసిరారు.
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్నది ‘ఫెవికల్ బంధం’ అని, వారిద్దరూ వేర్వేరు కాదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి నిజామాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.