కరెన్సీ నోట్లు తరలిస్తుండగా.. కూలిన విమానం


 ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళ్తున్న వైమానిక దళానికి చెందిన ఓ విమానం కూలిపోయింది (plane crash). ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 

బొలీవియా రాజధాని లా పాజ్‌ సమీపంలోని ఎల్‌ ఆల్టో నగరంలో ఈ ఘటన జరిగింది. బొలీవియా ఎయిర్‌ఫోర్స్‌ విమానం శాంటాక్రూజ్‌ నుంచి బయలుదేరింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ల్యాండింగ్‌ సమయంలో రన్‌వే నుంచి పక్కకి జారిపోయింది. ఈ క్రమంలో రద్దీగా ఉన్న రోడ్డు పైకి దూసుకెళ్లి పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా, 30 మంది గాయపడ్డారు. మృతుల్లో విమానంలో ఉన్నవారితో పాటు.. రోడ్డుపై వెళ్తున్న పౌరులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీని ఇతర నగరాలకు తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగిందని దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారులను ఉటంకిస్తూ అక్కడి  మీడియా పేర్కొంది.

ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఎల్‌ ఆల్టో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విమానంలోని కరెన్సీ నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అక్కడి ప్రజలు వాటిని తీసుకునేందుకు పోటీపడుతుండగా పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Previous Post Next Post

نموذج الاتصال

💬 Chat 📢 Follow