జర్నలిస్టుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
మీడియా అకాడమీ చైర్మన్‌కు జడ్చర్ల జర్నలిస్టుల వినతిపత్రం
జడ్చర్ల, :
జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జడ్చర్ల జర్నలిస్టు సంఘం నాయకులు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి కీలక డిమాండ్లు వినిపించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్ పాస్ సౌకర్యం, అక్రిడేషన్ కార్డును ఆధారంగా చేసుకొని అన్ని టోల్ గేట్లలో ఫ్రీ ప్రయాణం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి ప్రింట్ జర్నలిస్టుకు ల్యాప్‌టాప్, కెమెరా, వీడియో జర్నలిస్టులకు ల్యాప్‌టాప్‌తో పాటు వీడియో కెమెరాలను 100 శాతం సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు ఉచిత, మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ, సమాజానికి సమాచార వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించాలని నేతలు విజ్ఞప్తి చేశారు.
ఈ వినతికి స్పందించిన మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జడ్చర్ల జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా రెండు రోజుల శిక్షణా తరగతులు నిర్వహించి పూర్తి స్థాయి సర్టిఫికెట్లు అందిస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టుల నైపుణ్యాభివృద్ధికి మీడియా అకాడమీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జడ్చర్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వడ్ల కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎం.డి. సుల్తాన్, ఉపాధ్యక్షుడు శేఖర్ తెలుగు, సంయుక్త కార్యదర్శి మల్లేష్, ఈసీ సభ్యుడు తాంబూలం శ్రీనివాస్‌తో పాటు సీనియర్ పాత్రికేయులు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.